UPDATED 10th AUGUST 2026 3:00 PM
- పాప అన్నప్రాసన వేడుకకు వెళ్లొస్తుండగా మల్లేపల్లి వద్ద ప్రమాదం
- అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన చెన్నారావు
- నలుగురి పరిస్థితి విషమం.. కాకినాడ ఆసుపత్రికి తరలింపు
గండేపల్లి, రెడ్ బీ న్యూస్, ఆగష్టు 10 : చిరునవ్వులతో మొదలైన ఆ దైవదర్శన ప్రయాణం తీరని విషాదాన్ని మిగిల్చింది. చిన్నారి అన్నప్రాసన వేడుక కోసం పవిత్ర పుణ్యక్షేత్రానికి వెళ్లిన బంధువుల ఇంట తీవ్ర శోకం అలముకుంది. వారు ప్రయాణిస్తున్న బొలేరో వ్యాన్ టైరు పేలి బోల్తా పడటంతో ఒకరు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
అసలేం జరిగిందంటే:
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం అంజనీపురం, సత్తెనగూడెం, ఖమ్మంపాడు, విజయవాడ ప్రాంతాలకు చెందిన 17 మంది సమీప బంధువులు శనివారం రాత్రి అన్నవరం బయలుదేరారు. అంజనీపురానికి చెందిన అల్లాడి గోపికృష్ణ-రాజేశ్వరి దంపతుల కుమార్తె 'అరణ్య' అన్నప్రాసనం నిమిత్తం వీరంతా కలిసి వెళ్లారు. ఆదివారం ఉదయం అన్నవరంలో పాపకు అన్నప్రాసన వేడుక, స్వామివారి దర్శనం పూర్తి చేసుకున్నారు. అనంతరం తలుపులమ్మ లోవ అమ్మవారిని దర్శించుకుని స్వగ్రామానికి తిరుగుప్రయాణమయ్యారు.
అదుపుతప్పిన వ్యాన్:
కాకినాడ జిల్లా గండేపల్లి మండలం మల్లేపల్లి గ్రామ శివారులోని పోలవరం బ్రిడ్జి వద్దకు వచ్చేసరికి బొలేరో వ్యాన్ వెనుక టైరు ఒక్కసారిగా పేలిపోయింది. వేగంగా ఉన్న వాహనం అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది. ఈ ఘోర ప్రమాదంలో వ్యాన్లో ప్రయాణిస్తున్న అల్లాడి చెన్నారావు (46) తీవ్ర గాయాలపాలై సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.
నలుగురి పరిస్థితి విషమం:
ఈ ప్రమాదంలో అల్లాడి సరోజినీ, మేడిపల్లి నాగేంద్రమ్మ, అన్నాబతుల సామ్రాజ్యం, స్నేహ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే జెడ్. రాగం పేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో, మెరుగైన వైద్యం కోసం ఇద్దరిని కాకినాడ ఆసుపత్రికి తరలించారు. మరో 11 మంది ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
కేసు నమోదు.. దర్యాప్తు:
సమాచారం అందుకున్న వెంటనే జగ్గంపేట సీఐ బి.తిరుపతిరావు, గండేపల్లి ఎస్ఐ శివ నాగబాబు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. పసిపాప మొదటి కూడు వేడుక కోసం ఎంతో సంతోషంగా వెళ్లిన ప్రయాణం ఇలా విషాదాంతం అవ్వడంతో చిన్నారి తల్లిదండ్రులు గోపికృష్ణ, రాజేశ్వరి రోదనలు స్థానికులను కంటతడి పెట్టించాయి.







