Updated 3rd May 2017 Wednesday 1:00 PM
అమరావతి: రాష్ట్రంలో తరచుగా సంభవిస్తున్న రోడ్డు ప్రమాదాలపై అధ్యయనానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పోలీస్, రవాణా అధికారులను ఆదేశించారు. విజయవాడలోని బస్ భవన్ లో రహదారుల భద్రత పై జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన బుధవారం మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు అవసమైన పక్షంలో ప్రస్తుతం ఉన్న చట్టాలను సవరించేందుకు సైతం ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. కేవలం ప్రమాదాలతో పాటు ప్రాణ నష్టం జరిగిన సమయంలో ఆయా శాఖలు తాత్కాలిక నివారణా చర్యలకే పరిమితమౌతున్నాయన్నారు. రోడ్లు భవనాలు, రవాణా, పోలీస్ శాఖల మధ్య సమన్వయము అవసరమన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు శాశ్వత ప్రణాళికలు రూపొందించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ప్రమాదాలకు కారణమవుతున్న వాహనాల డ్రైవర్ల లైసెన్సులపై తనిఖీ అవసరమని, ఎలాంటి అనుభవం లేకుండా డ్రైవింగ్ లైసెన్స్ పొందడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన అభిప్రాయం పాడారు. ఇటువంటి లైసెన్సులను గుర్తించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అలాగే రాష్ట్రంలో పలు రహదారులపై గుర్తించిన 1100 బ్లాక్ స్పాట్స్ ప్రాంతాల్లో సిసి కెమెరాలను, సైన్ బోర్డులు, లైటింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రతీ సంవత్సరం సుమారు ఎనిమిది వేల మంది రోడ్డు ప్రమాదాల కారణంగా మరణిస్తుండగా ౩౦ వేలమంది వరకు గాయపడి అంగవైకల్యం బారిన పడుతున్నారన్నారు. రోడ్డు ప్రమాదాలను పూర్తి స్థాయిలో నివారించాలని దృక్పథంతో ప్రభుత్వం ఉందన్నారు. జాతీయ రహదారుల వెంబడి పోలీస్ తనికీలు ముమ్మరం చేయాలని మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని ఉపేక్షించవద్దని పోలీస్, రవాణా అధికారులను ఆదేశించారు. ప్రమాదాలను అరికట్టేందుకు పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులకు అవగాహనా తరగతులు నిర్వహించే విషయాన్ని పరిశీలించాలని డిజిపి నండూరి సాంబశివరావు ను ఆదేశించారు. ఈ సమావేశంలో రవాణాశాఖ కమీషనర్ బాలసుబ్రహ్మణ్యం, రోడ్లు భవనాలు, రవాణా, పోలీస్ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.







