Janasena Pawan Kalyan: బురద రాజకీయాలు చేతకాదు, రైతులకు అండగా నిలవడం మా బాధ్యత: పవన్

UPDATED 20th APRIL 2022 WEDNESDAY 06:20 PM

Janasena Pawan Kalyan: తమకు బురద రాజకీయాలు చేతకాదని రైతులకు అండగా నిలవడం మా బాధ్యత అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. బుధవారం జనసేన కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేసిన పవన్ కళ్యాణ్..రైతులలో మనోస్థైర్యాన్ని నింపే దిశగా అధికారులు చొరవ తీసుకోవాలని కోరారు. సాగు నష్టాలు, రుణ భారంతో రైతులు మానసికంగా కుంగిపోతున్నారని..వారికి భవిష్యత్తుపై భరోసా కల్పించడంలో పాలకపక్షం విఫలమవుతోందని పవన్ విమర్శించారు.

ఇందుకు రైతుల ఆత్మహత్యల ఘటనలే ప్రత్యక్ష ఉదాహరణలుగా పవన్ వివరించారు. కర్నూలు జిల్లా మేళిగనూరుకి చెందిన దేవరమణి జగదీష్, ప్రకాశం జిల్లా కాటూరివారి పాలేనికి చెందిన పాలగిరి రామ్మూర్తి అనే రైతులు పంట నష్టాలు, అప్పుల బాధతో ఆత్మహత్యలకు పాల్పడ్డారని తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యానన్న పవన్..వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.రైతులు బలవన్మరణానికి ఒడిగట్టాల్సిన పరిస్థితులు వారి ముందు ఉన్నాయంటే..వ్యవసాయ రంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడం లేదు అని అర్ధం అవుతోందని అధికార ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు పవన్. బాధ్యతగల పార్టీగా జనసేన కౌలు రైతులు, వ్యవసాయ రంగాన్ని నమ్ముకొన్నవారి గురించి మాట్లాడుతుంటే పాలక పక్షం మాత్రం దీన్ని రాజకీయ కోణంలోనే చూస్తోందని ఆయన విమర్శించారు.

రైతులకు అండగా నిలవడం జనసేన ఒక బాధ్యతగా చేపట్టిందని..బురద రాజకీయాలు మాకు చేతకాదని పవన్ అన్నారు. అధికార ప్రభుత్వం రైతుల ఆత్మహత్యలపై కూడా రాజకీయాలు మాట్లాడటం కట్టిపెట్టి, అన్నదాతలకు ఏ విధమైన తోడ్పాటు ఇవ్వాలో బాధ్యతగల పదవుల్లో ఉన్న వాళ్ళు ఆలోచిస్తే మేలని జనసేన అధినేత హితవు పలికారు.రెవెన్యూ రికార్డులను ప్రక్షాళన చేసి రైతులకు , భూ యజమానులకు ఊరట ఇస్తామని ఐ.ఏ.ఎస్ అధికారులు ప్రెస్ మీట్ ద్వారా వివరించడం రైతులకు కాస్త ఊరట కలిగించే విషయమని పవన్ పేర్కొన్నారు.

భూ రికార్డుల్లో పొరపాటును సరిచేయమని అధికారుల చుట్టూ తిరిగి విసిగిపోయి..ఇక్కుర్తి ఆంజనేయులు అనే రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉన్నత స్థాయి అధికారుల్లో కదలిక తెచ్చిందని.. సదరు రైతు సమస్యపై గుంటూరు జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి ఆదేశాలు ఇచ్చినా..క్షేత్ర స్థాయి రెవెన్యూ అధికారులు స్పందించకపోవడం వెనుక ఏవైనా రాజకీయపరమైన ఒత్తిళ్ళు ఉన్నాయా అనే సందేహాన్ని పవన్ వ్యక్తం చేశారు.సాగు నష్టాలు, అప్పులు, భూ రికార్డుల్లో లోపాలతో ఇక్కట్ల పాలై బలవన్మరణాల దిశగా రైతులు ఆలోచన చేసే పరిస్థితులు రాకుండా వ్యవస్థలు బాధ్యతాయుతంగా ముందుకు వెళ్ళాలని పవన్ కళ్యాణ్ సూచించారు. ఉన్నతస్థాయి రెవెన్యూ , సర్వే అధికారులతోపాటు జిల్లా స్థాయిలో ఉన్న ఐ.ఏ.ఎస్, ఐ.పి.ఎస్ అధికారులు రైతాంగంలో మనోస్థైర్యం నింపే దిశగా చొరవ తీసుకొని వారి సమస్యలు సత్వర పరిష్కారానికి మానవతా దృక్పథంతో స్పందించాలని జనసేన అధినేత పవన కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us