UPDATED 17th MARCH 2022 THURSDAY 07:00 AM
Minister KTR : కరీంనగర్ గులాబీ మయం అయిపోయింది. ఎక్కడ చూసినా మంత్రి కేటీఆర్ ఫొటోలు, ఫ్లెక్సీలు, టీఆర్ఎస్ జెండాలు దర్శనమిస్తున్నాయి. కేటీఆర్ కు ఘన స్వాగతం పలికేందుకు గులాబీ శ్రేణులు సిద్ధమయ్యాయి. మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. పలు అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు 2022, మార్చి 17వ తేదీ గురువారం మంత్రి కేటీఆర్ కరీంనగర్ జిల్లాకు రానున్నారు.
తిమ్మాపూర్ మండల కేంద్రంలో మంత్రి గంగుల ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఐదు వేల బైక్ లతో భారీ ర్యాలీగా మానేరు బ్రిడ్జీ దాక వెళ్లనున్నారు. ప్రధాన చౌరస్తాలన్నింటిలో భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మంత్రి కేటీఆర్ ముందుగా మానేరు బ్రిడ్జీ వద్ద రూ. 410 కోట్లతో మానేరు రివర్ ఫ్రంట్ పనులకు శంకుస్థాపన చేస్తారు. అక్కడే ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ పైలాన్ ను ఆవిష్కరించనున్నారు.
రాంనగర్ లోని మార్క్ ఫెడ్ మైదానం దాక బైక్ ర్యాలీగా వెళ్లనున్నారు. మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో రూ .615 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అక్కడ ఏర్పాటు చేసే బహిరంగసభలో మంత్రి కేటీఆర్ ప్రసంగించనున్నారు. సభ అనంతరం చొప్పదండి మున్సిపాల్టీకి చేరుకుని రూ. 38 కోట్ల వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు భూమి పూజ చేయనున్నారు.
సాయంత్రం జిల్లాలోని ఉజ్వల పార్కు సమీపంలో రూ. 5 కోట్ల వ్యయంతో నిర్మించిన బీసీ స్టడీ సర్కిల్ భవనాన్ని ప్రారంభిస్తారు.







