UPDATED 6th SEPTEMBER 2017 WEDNESDAY 10:00 PM
సామర్లకోట: ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టి సద్వినియోగం చేసేలా రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని ఉపముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో స్థానిక కుమారా రామ భీమేశ్వరస్వామి ఆలయం వద్ద వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ బుధవారం నిర్వహించిన జలసిరి హారతి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నదులు, జలవనరుల పట్ల కృతజ్ఞతలు తెలియజేయడానికి రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజులు పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హిందూ సాంప్రదాయంలో జలాలకు అధిక ప్రాధాన్యత ఉందని, ప్రతీ ఒక్కరూ ఈ జలసిరి హారతి కార్యక్రమంలో పాల్గొని హారతి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. రాష్ట్రాన్ని కరవురహితంగా చేసేందుకు ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని, దీనిలో భాగంగా పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గుంటూరు, రాయలసీమలకు గోదావరి జలాలను పంపడం జరిగిందన్నారు. అలాగే రూ.1650 కోట్లతో పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని సంవత్సరం లోపే ప్రారంభించి గోదావరి జలాలను ఏలేరులోకి అనుసంధానం చేయడం జరుగుతుందన్నారు. జాతీయ స్థాయిలో 40 వేల కోట్ల రూపాయలతో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఆయన తెలిపారు. రాష్ట్రంలో సముద్రంపాలవుతున్న గోదావరి జలాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుని రైతాంగానికి మేలు చేయాలనే దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు పనిచేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ మన్యం పద్మావతి, వైస్ ఛైర్మన్ యార్లగడ్డ రవిచంద్ర ప్రసాద్, దేవస్థానం అధ్యక్షుడు కంటే బాబు, ఎఎంసి చైర్మన్ పాలకుర్తి శ్రీనివాసాచార్యులు, వైస్ చైర్మన్ రవిచంద్ర, టిడిపి రాష్ట్ర ప్రచార కార్యదర్శి మన్యం చంద్రరావు, ఆసుప్రతి అభివృద్ధి కమిటీ ఛైర్మన్ అడబాల కుమార స్వామి, ఎంపిపి మోర్త, ఇరిగేషన్ ఎస్‌ఈ డి.రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.







