అమరావతి (రెడ్ బీ న్యూస్) 5 డిసెంబర్ 2021: అంతుచిక్కని జ్వరాలతో విద్యార్థుల మరణాలు.. నిర్లక్ష్యపు జగన్ సర్కారు చేసిన హత్యలేనని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం బోడిగూడెం గ్రామంలో అంతుచిక్కని జ్వరాలతో 15ఏళ్లలోపు విద్యార్థులు నలుగురు మృత్యువాతపడగా, 50 మందికి పైగా విద్యార్థులు వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై ఆయన మండిపడ్డారు. వీటికి సంబంధించిన కొన్ని వీడియోలను ఆయన విడుదల చేశారు. కొన్ని వారాలుగా 15ఏళ్లలోపు విద్యార్థులు వేర్వేరు లక్షణాలు, జ్వరాలతో బాధపడుతుంటే వైద్యారోగ్యశాఖ, విద్యాశాఖ అధికారులు కనీసం పట్టించుకునే స్థితిలో లేకపోవడం దారుణమన్నారు. అంతుచిక్కని జ్వరాలు ఎందుకొస్తున్నాయో కూడా దృష్టిసారించే తీరికలేని ప్రభుత్వం.. ఇంకెంతమంది పిల్లలు చనిపోతే స్పందిస్తుందని ప్రశ్నించారు.







