* రానున్న కాలంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు అమలు
* డిప్యూటీ సిఎం కె.ఈ. కృష్ణమూర్తి
UPDATED 2nd JULY 2018 MONDAY 10:00 PM
బిక్కవోలు: రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ద్వారా ప్రజల్లో ప్రభుత్వం పట్ల ఆదరణ పెరిగిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె.ఈ. కృష్ణమూర్తి అన్నారు. అనపర్తి నియోజకవర్గంలో రూ. ఆరు కోట్లు వ్యయంతో చేపట్టనున్న ఆర్ అండ్ బి రహదారి పనులకు మంత్రి సోమవారం శంకుస్థాపన చేసారు. ఈ సందర్భంగా బిక్కవోలు మండలం అరికిరేవుల గ్రామంలో జరిగిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజామోదం పొందాయని, ఇటీవల వి.ఆర్.ఎ, అంగన్వాడీ కార్యకర్తలకు వేతనాలు పెంపు, హోమ్ గార్డుల సంక్షేమానికి తీసుకున్న నిర్ణయాలపై ఆత్మీయ సభలు ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని అభినందిస్తున్నారని, సంక్షేమ కార్యక్రమాల అమల్లో భాగంగా చంద్రన్న బీమా, చంద్రన్న పెళ్ళి కానుక వంటి వినూత్న కార్యక్రమాలు రాష్ట్రంలో అమలు జరుగుతున్నాయని అన్నారు. పోలవరం ప్రాజెక్టును నిర్ణీత సమయంలో పూర్తి చేయటానికి ముఖ్యమంత్రి కృత నిశ్చయంతో ఉన్నారని, రాష్ట్రంలో రానున్న కాలంలో ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ వివిధ పథకాలు అమలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాజమహేంద్రవరం ఎం.పి. మాగంటి మురళీమోహన్ మాట్లాడుతూ కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ విధమైన హామీ రాలేదని కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు రాష్ట్ర ప్రజల హక్కు అని, ప్లాంట్ ఏర్పాటుకు 50 శాతం నిధులు కూడా భరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గ్రామాల్లో మౌళిక సదుపాయాలు కల్పన ద్వారా గ్రామ అభ్యుదయం జరుగుతుందని అన్నారు. అనపర్తి ఎంఎల్ఎ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రధాన రహదారులైన తొస్సిపూడి- జి.మామిడాడ, మొల్లేరు- చోడవరం, గండ్రేడు- కుమార ప్రియం ఆర్ అండ్ బి రోడ్లను చేపడుతున్నామని, నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాల అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు.







