UPDATED 28th APRIL 2018 SATURDAY 6:30 PM
సామర్లకోట: తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం పెదబ్రహ్మదేవం గ్రామంలో గల శ్రీ శారదా రామకృష్ణ సేవాసమితి ఆధ్వర్యంలో 5,6,7వ తరగతి విద్యార్థులకు వేసవి శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు సమితి అధ్యక్షుడు తోటకూర గంగాధర్ తెలిపారు. ఈ నెల 30వ తేదీ నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు ఉదయం ఎనిమిది గంటల నుంచి పదకొండు గంటల వరకు ఈ ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహిస్తామని, ఇందులో ఆయా తరగతుల పాఠ్యంశాలతో పాటు నీతిశతకాలు, చిత్రలేఖనం, చదరంగం మొదలైన వాటిపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, ఆసక్తి గల విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విద్యతోనే సమాజాభివృద్ధి సాధ్యపడుతుందని, అందుకే సమితి సేవా కార్యక్రమాలలో విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని అన్నారు. శ్రీ విశ్వనాధ విద్యాప్రకాశిని పేరిట సమితి గౌరవ అధ్యక్షులు వింజమూరి సుబ్రహ్మణ్యశర్మ ఆర్ధిక సహాయంతో సమితి ఆధ్వర్యంలో వేసవి శిక్షణా తరగతుల నిర్వహణ, పదవ తరగతి విద్యార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ పంపిణీ, ఉత్తమ ప్రతిభ కనబరిచిన పదవ తరగతి విద్యార్థులకు నగదు పురస్కారంతో ప్రోత్సహించడం ద్వారా విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తూ విద్యాభివృద్ధితోనే ప్రగతి సాధ్యపడుతుందని, గ్రామంలో గల విద్యావంతులు, ఉపాధ్యాయుల సహాయంతో కృషి చేస్తున్నామని గంగాధర్ తెలియచేశారు. అలాగే వచ్చే నెల 11వ తేదీ సమితి 58వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సమితి కార్యదర్శి వింజమూరి విశ్వనాధం తెలిపారు. ఈ సమావేశంలో సమితి సభ్యులు టి.వి.వి. సత్యనారాయణ, పెంటపాటి మల్లిఖార్జునరావు, సూర్యప్రభాకర్, చెవ్వాకుల సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.







