అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు

UPDATED 11TH MAY 2017 THURSDAY 6:00 PM

కాకినాడ: కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహాయంతో అమలు జరుగుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను లక్షిత వర్గాలకు చేరేలా జిల్లా యంత్రాంగం కృషి చేయాలని దిశా ఛైర్మన్‌, ఎంపీ మాగంటి మురళీమోహన్‌ సూచించారు. కలెక్టరేట్‌ విధాన గౌతమి హాల్ లో జిల్లా అభివృద్ధి సమన్వయం, పర్యవేక్షక కమిటీ (దిశా) సమావేశాన్నికమిటీ ఛైర్మన్‌ ఎంపీ మురళీమోహన్‌ అధ్యక్షతన గురువారం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహాయంలో అమలు జరుగుతున్న 28 కార్యక్రమాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఎంపీ మురళీ మోహన్‌ మాట్లాడుతూ వ్యవసాయానికి జాతీయ ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేయాలని సూచించారు. దీంతో సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. దీనిపై ఎంపీ తోట నరసింహం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రానికి ప్రతిపాదన పంపిందని, సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవ తీసుకుని కేంద్రంతో మాట్లాడారని, త్వరలో సానుకూల నిర్ణయం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర శాసనమండలి ఉపాధ్యక్షుడు రెడ్డి సుబ్రమణ్యం మాట్లాడుతూ అంత్యోదయ కార్డుల కోటా పెంచాలని తీర్మానం చేసి, కేంద్రానికి పంపాలని కోరారు. దీనికి సమావేశం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. గ్రామ పంచాయతీల వద్ద ఉన్న నిధుల ఆవశ్యకతను పరిగణలోకి తీసుకోకుండా జాతీయ ఉపాధి హామీ నిధులను వివిధ పనులకు కేటాయిస్తున్నారని, దీంతో పనులు పూర్తికావడం లేదన్నారు. ఆయా గ్రామ పంచాయతీ వద్ద ఎంత మొత్తంలో నిధులు ఉన్నాయి, వాటిలో ఎంత కేటాయిస్తారో పరిశీలించి, దానికి అనుగుణంగా ఉపాధి హామీ పథకం నిధులు కేటాయించి, పనులకు మంజూరు ఉత్తర్వులు ఇవ్వాలని సూచించారు. దీనిని పూర్తిస్థాయిలో పరిశీలిస్తామని జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఉజ్వల పథకంలో ఇప్పటికే నిర్ధేశిత లక్ష్యాలు పూర్తి చేశామని, 10.321 గ్యాస్‌ కనెక్షన్లు పంపిణీ చేసినట్లు డీఎస్‌వో రవికిరణ్‌ తెలిపారు. దీనిపై ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ ఉజ్వల పథకం కింద జిల్లాకు 50 వేల గ్యాస్‌ కనెక్షన్లు వచ్చేలా ప్రతిపాదనలు పంపాలని సూచించారు. దీపం పథకంలో ఇంకా 2 లక్షల మందికి పైగా గ్యాస్‌ కనెక్షన్లు అందించాల్సి ఉందని, సాధ్యమైనంత వరకూ ఈనెలాఖరునాటికి పంపిణీ చేస్తామని కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా చెప్పారు. పేదలకు అందజేస్తున్న పింఛన్లపై కూడా సుదీర్ఘ చర్చ జరిగింది. ప్రతినెలా 3వ తేదీనాటికి పింఛన్లు పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్‌ చెప్పారు. సమావేశంలో జడ్పీ ఛైర్మన్‌ నామన రాంబాబు, ఎమ్మెల్సీలు చిక్కాల రామచంద్రరావు, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, టి.రత్నాబాయి, ఎమ్మెల్యేలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, పిల్లి అనంతలక్ష్మి, సంయుక్త కలెక్టర్‌ మల్లికార్జున, రాజమహేంద్రవరం మున్సిపల్‌ కమిషనర్‌ విజయరామరాజు, జేసీ-2 రాధాకృష్ణమూర్తి, ఇన్‌ఛార్జి డీఆర్వో జ్యోతి తదితరులు పాల్గొన్నారు. నీరు-చెట్టు కార్యక్రమం ద్వారా చేపడుతున్న పనుల పర్యవేక్షణ దారుణంగా ఉందని ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. చెరువులు, కాలువల్లోంచి తీస్తున్న మట్టి రియల్టర్ల వెంచర్లలో, కొందరు ప్రజాప్రతినిధుల పొలాల్లో వేస్తున్నారని ఆరోపించారు. రంగంపేట-మల్లేపల్లి రహదారిని రూ.4.65 కోట్లలో అభివృద్ధి చేశారని, పనులు పూర్తి చేసిన కొన్నాళ్లకు రహదారి మధ్యలో పెద్ద బీటలు వచ్చాయని, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. దీనిపై పంచాయతీరాజ్‌ శాఖ అధికారి వివరణ సరిగా లేకపోవడంతో ధ్వజమెత్తారు. అసలు నాణ్యత ఎవరు పరిశీలిస్తున్నారని ఎంపీ మురళీమోహన్‌ ప్రశ్నించారు. దీనిపై కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా కలుగజేసుకుని... వెంటనే వెళ్లి రహదారి పరిశీలించండి, గుత్తేదారుపై చర్యలు చేపట్టండి. రహదారి బీటలు ఫొటోలు తీయండి, బాగు చేసిన తరువాత ఫొటోలు తీసి, నివేదిక ఇవ్వండి.. అని అధికారులను ఆదేశించారు. ఎంపీ మురళీమోహన్‌ దత్తత తీసుకున్న రంగాపురం గ్రామాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కోరారు. ఇక్కడ డీపీవో కుమార్‌ను నోడల్‌ అధికారిగా నియమించి, సర్వే చేసి నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ ఆదేశించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ద్వారా అమలు చేస్తున్న గృహనిర్మాణ పథకాలపై సమావేశంలో సుదర్ఘీంగా చర్చించారు. ఇళ్ల కేటాయింపులో రిజర్వేషన్లు ఎంత వరకూ పాటిస్తున్నారని రాష్ట్ర శాసనమండలి ఉపాధ్యక్షుడు రెడ్డి సుబ్రహ్మణ్యం ప్రశ్నించారు. దీనిపై జిల్లా గృహనిర్మాణ సంస్థ పీడీ, జేసీ-2 రాధాకృష్ణమూర్తి వివరణ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న అందరికీ ఇళ్ల పరిస్థితిపై ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ మాట్లాడుతూ మైనారిటీ లబ్ధిదారులు తక్కువగా ఉన్నారని, ఈ వర్గానికి కేటాయించిన ఇళ్లు ఇతర వర్గాలకు బదలాయించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు అధికారులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఇళ్లు పూర్తిగా నిర్మాణం చేయాలని సూచించారు. సామాజిక, ఆర్థిక గణన (సెక్‌) ఆధారంగా ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన పథకంలో లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us