హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 16 డిసెంబర్ 2021: తెలంగాణలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఎట్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన వారిలో మరో నలుగురికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య ఏడుకు చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. ఇప్పటివరకు ఎట్ రిస్క్ దేశాల నుంచి 6,764 మంది ప్రయాణికులు రాష్ట్రానికి రాగా.. వారిలో 21 మందికి ఆర్‌టీ-పీసీఆర్ పరీక్షల్లో కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. వీరందరి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం అధికారులు పంపించారు. వాటిలో ఇప్పటికే 17 మందికి ఒమిక్రాన్ నెగెటివ్‌గా తేలగా.. ఏడుగురికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మరో ముగ్గురి ఫలితాలు రావాల్సి ఉంది. తెలంగాణలో గత 24 గంటల్లో 40,103 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 190 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 6,79,064కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. నిన్న కరోనాతో ఇద్దరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 4,012కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 195 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,805 యాక్టివ్ కేసులు ఉన్నాయి.







