పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలి

UPDATED 23rd APRIL 2018 MONDAY 9:00 PM

సామర్లకోట: పట్టణ ప్రజలకు స్వచ్చమైన తాగునీరు అందించాలని ప్రతిపక్ష కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం వైస్ చైర్మన్ యార్లగడ్డ రవిచంద్ర ప్రసాద్ అధ్యక్షతన సోమవారం జరిగింది. ఈ సమావేశంలో ఫిల్టరు చెరువులో నీటిని పూర్తి స్థాయిలో నింపి ఆ నీటిని నాగార్జున ఫ్యాక్టరీ వారు తీసుకువెళ్లకుండా చూడాలని ప్రతిపక్ష నాయకులు ఆవాల లక్ష్మీ నారాయణ, కాళ్ల లక్ష్మీ నారాయణ, ఊబా జాన్ మోజస్ డిమాండ్ చేశారు. ఫిల్టరు చెరువులో సామర్థ్యం మేరకు నీటిని నింపుతామని, నీటి ఎద్దడి ఉంటే బోర్లను ఉపయోగిస్తామని మున్సిపల్ డిఇ ప్రభాకర్ అన్నారు. బోరు నీరు వల్ల ప్రజల ఆరోగ్యానికి హాని కలుగుతుందని, గోదావరి నీటిని సరఫరా చేయాలని కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. గోదావరి జలాలు నేరుగా ఫిల్టరు ప్లాంటులోకి వచ్చే విధంగా చేయడం వలన ఖర్చు తగ్గి నీటి సమస్య తీరుతుందని కాళ్ల లక్ష్మీనారాయణ సూచించారు. ఆరో వార్డులో పైపు లైన్లతో పాటు ఏడాది క్రితం ఆమోదం పొందిన పనులు పూర్తి చేయడం లేదని, కాంట్రాక్టరును ప్రశ్నిస్తే మున్సిపాలిటీ బిల్లు చెల్లించడంలేదని చెప్పుతున్నారని కౌన్సిలర్ ఊబా జాన్ మోజస్ ఆరోపించారు. అన్ని కులాల వారికి కల్యాణ మండపాలు నిర్మిస్తున్నారని కానీ అయితే ఎస్సీలకు మాత్రం మంజూరు చేయడంలేదని కాళ్ల లక్ష్మీ నారాయణ ఆరోపించారు. బళ్లమార్కె ట్లో ఎంతో విలువైన స్థలం ఆక్రమణకు గురవుతున్నా పట్టించుకోవడం లేదని వెంటనే ఆక్రమణలను తొలగించాలని మన్యం చంద్రరావు అధికారులకు సూచించారు. పట్టణ పరిధిలోని 30 వార్డులకు సమానంగా నిధులు కేటాయించవలసి ఉండగా ప్రతిపక్ష వార్డులకు అన్యాయం చేశారని ప్రతిపక్ష సభ్యులు ఆరోపించారు. ఆయా వార్డుల నుంచి వచ్చిన ప్రతిపాదనల మేరకే అభివృద్ధి పనులను అజెండాలోనికి తీసుకురావడం జరిగిందని డిఇ తెలిపారు. అనంతరం జరిగిన అత్యవసర సమావేశంలో వివిధ అంశాలపై చర్చించారు.

 

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us