AP Government : ఏపీ గ్రామ సచివాలయాల ఉద్యోగుల వేతనాలు పెంపు..ఈ నెల నుంచే చెల్లింపు

UPDATED 26th JULY 2022 TUESDAY 09:00 PM

AP government : ఏపీలోని గ్రామ సచివాలయాల ఉద్యోగుల వేతనాలు పెరిగిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్‌ ఖరారు అనంతరం ఈ నెల నుంచే కొత్త పీఆర్సీ పేస్కేలు ప్రకారం పెరిగిన వేతనాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

వీరికి పే స్కేలుతో పాటు డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర అలవెన్స్‌లు కలిపి వేతనాలు చెల్లించేందుకు ఆర్థిక శాఖలో కొత్తగా వివిధ ఖాతాల ఏర్పాటుతో పాటు అదనపు బడ్జెట్‌ కేటాయింపులు చేసింది. ప్రత్యేకించి గ్రామ సచివాలయాల ఉద్యోగుల వేతనాల కోసం కేటాయించిన రూ.768.60 కోట్ల అదనపు నిధులను విడుదల చేసేందుకు ఆర్థిక శాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ సోమవారం (జులై26,2022) ఉత్తర్వులు జారీ చేశారు.ఈ ఆర్థిక సంవత్సరంలో గ్రామ సచివాలయ ఉద్యోగుల వేతనాల కోసం ఇప్పటికే రూ. 1,995 కోట్లు విడుదల చేశారు. తాజాగా విడుదల చేసిన నిధులతో కలిపి మొత్తం రూ. 2,763.60 కోట్లు విడుదల చేసినట్లు ఆర్థిక శాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ పేర్కొన్నారు. వార్డు సచివాలయ ఉద్యోగులకు కూడా పెరిగిన వేతనాలు ఈ నెల నుంచి రానున్నాయి.

ఇందుకు అదనపు నిధులను నేడో రేపో విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేయనుంది. ఆదివారం సెలవు దినమైనప్పటికీ ఆర్థిక శాఖ అధికారులు ఆఫీసులకు వచ్చి సచివాలయాల ఉద్యోగుల జీతాలకు సంబంధించిన అన్ని హెడ్స్‌ను రూపొందించారని, పెరిగిన జీతాలకు అనుగుణంగా అదనపు కేటాయింపులకు ప్రతిపాదనలు సిద్ధం చేశారని ఆంధ్రప్రదేశ్‌ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షులు కాకర్ల వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు.

ఇచ్చిన మాట ప్రకారం సచివాలయాల ఉద్యోగులకు కొత్త వేతనాలు చెల్లించేందుకు ఆదేశాలు జారీ చేసిన సీఎం జగన్‌ కు కృతజ్ఞతలు తెలిపారు. వార్డు సచివాలయాల ఉద్యోగులకు పెరిగిన జీతాల జీవో కూడా వేరుగా విడుదలవుతుందని వెల్లడించారు.ప్రొబేషన్‌ డిక్లేర్‌ అయిన ఉద్యోగులెవరూ ఆందోళన చెందవద్దని, అందరికీ పే స్కేల్‌ ప్రకారం జీతాలు వస్తాయని తెలిపారు. ఇచ్చిన హామీ మేరకు సచివాలయాల ఉద్యోగుల ప్రొబేషన్‌ ఖరారు, పెరిగిన వేతనాలు అమలు చేస్తున్న సీఎం జగన్‌ కు గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు భీంరెడ్డి అంజన్‌ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బత్తుల అంకమ్మరావు, రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి బి.ఆర్‌.ఆర్‌.కిషోర్, వర్కింగ్‌ ప్రెసిడెంట్స్‌ విప్పర్తి నిఖిల్‌ కృష్ణ, భార్గవ్‌ సుతేజ్‌ కృతజ్ఞతలు తెలిపారు.

గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎం.డి. జాని పాషా సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. ప్రొబేషన్‌ పూర్తి చేసుకున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు పెరిగిన జీతాలు అందుతాయని గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తుల అంకమ్మరావు పేర్కొన్నారు. గుంటూరు డొంక రోడ్డులోని సచివాలయం వద్ద నిన్న జరిగిన కార్యక్రమంలో సీఎం జగన్‌కు ఉద్యోగులు ధన్యవాదాలు తెలిపారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us