శ్రీనగర్ (రెడ్ బీ న్యూస్) 14 డిసెంబర్ 2021: జమ్మూ-కశ్మీర్‌లోని పూంచ్-రాజౌరీ సెక్టార్‌లో ఉగ్రవాద కార్యకలాపాలను పునరుద్ధరించేందుకు యత్నిస్తోన్న కీలక ఉగ్రవాది అబు జరారాను భద్రతాదళాలు మంగళవారం మట్టుబెట్టాయి. నిఘావర్గాల సమాచారంతో బెహ్రామ్‌గాలా ప్రాంతంలో కశ్మీర్ పోలీసులు, సైన్యం చేపట్టిన ఆపరేషన్‌లో అతడు హతమయ్యాడు. ఇద్దరు ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులు జరిపి తప్పించుకునేందుకు యత్నించారని.. కానీ, ఎదురు కాల్పుల్లో జరార మృతి చెందాడని, మరొకరు తప్పించుకున్నారని ఓ డిఫెన్స్ అధికారి వెల్లడించారు. మృతి చెందిన ఉగ్రవాది వద్ద నుంచి ఒక ఏకే- 47 రైఫిల్, నాలుగు మ్యాగజైన్లు, ఒక గ్రెనేడ్, కొంత నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. తప్పించుకున్న ఉగ్రవాదినీ పట్టుకునేందుకు తనిఖీలు ముమ్మరం చేశామన్నారు.







