UPDATED 12th JULY 2017 WEDNESDAY 7:00 PM
కాకినాడ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నాయని నిరసన గళమెత్తి ‘సమస్యలపై ప్రజాగర్జన’ పేరుతో బుధవారం సిపిఐ కాకినాడలో భారీ ప్రదర్శన నిర్వహించింది. సీపీఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పోలవరం నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమలు, పేదలకు ఇళ్ల స్థలాలు, ఏజెన్సీలో వ్యాధులబారిన పడిన గిరిజనుల మరణాలు, జన్మభూమి కమిటీల అక్రమాలు తదితర సమస్యలపై ఆందోళన చేపట్టారు. ముందుగా ఆనందభారతి మైదానం నుంచి ప్రారంభమైన ఈ ప్రదర్శన మొయిన్‌రోడ్డు, పోస్టాఫీసు, సూపర్‌బజారు, మసీదు జంక్షన్, దేవాలయం వీధి, బాలాజీ చెరువు సెంటర్, జిల్లా పరిషత్ జంక్షన్ మీదుగా కలెక్టరేట్ వరకూ సాగింది. గిరిజనుల రేలా నృత్యాలు, విల్లంబులతో ప్రదర్శన, జీఎస్టీ వాత ప్రజలపై మోత పేరుతో వినూత్నంగా నిరసన తెలిపారు. ఎర్రజెండాల రెపరెపలతో జిల్లా కేంద్రం కాకినాడ ఎరుపెక్కింది. ఈ ప్రదర్శనలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, జిల్లా కార్యదర్శి మధు, పార్టీ నేతలు, ప్రజాసంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు అధ్యక్షత వహించిన సభలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ ఈనెల 15న హైదరాబాద్‌లో జరగనున్నవామపక్షాల సమావేశంలో భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పోలవరం నిర్వాసితులను పూర్తిగా విస్మరించదని, పశ్చిమ గోదావరి జిల్లాలోని విలీన మండలాల్లోని కుక్కునూరు, వేలపాడు ప్రాంతాల్లో సర్వే నిర్వహించి మెరుగైన ప్యాకేజీ ఇస్తున్నారని, ఈ జిల్లాలో మాత్రం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమల్లో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారన్నారు. తాగునీరు లేక విష జ్వరాలతో గిరిజనులు మరణిస్తుంటే కనీస సౌకర్యాలు కల్పించడంలేదని, సీఎం చంద్రబాబుకు గిరిజనులపై చిత్తశుద్ధి ఉంటే విలీన మండలాల్లో పర్యటించాలన్నారు. కార్పొరేట్ల కొమ్ముకాయటానికే కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని తెచ్చారని, దీనిపై కనీసం అవగాహన సదస్సులు కూడా నిర్వహించలేదన్నారు. మూడేళ్లలో ఒక్క ఇల్లు కూడా రాష్ట్రంలో నిర్మించలేదని, జన్మభూమి కమిటీలు అధికార పార్టీ కొమ్ముకాస్తున్నారని, వీటిని తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి మధు మాట్లాడుతూ ప్రజా సమస్యలపై గత నెల 20 నుంచి సంతకాల సేకరణ చేశామని, దీనిలో అనేక సమస్యలు తమ దృష్టికి వచ్చాయని, వాటి పరిష్కారానికి పోరాడతామన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రాకు వినతి పత్రం సమర్పించారు. ప్రతినెలా ఒక సోమవారం చింతూరులో ప్రజావాణి నిర్వహిస్తామని ఆయన హామీ ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నేతలు నల్లా రామారావు, డాక్టర్ స్టాలిన్, తోకల ప్రసాద్, మండా దుర్గాప్రసాద్, నక్కా కిషోర్, జుత్తుక కుమార్, చెల్లుబోయిన కేశవశెట్టి, కె.మంగరాజు, కె.సత్తిబాబు, సేపేని రమణమ్మ, ఎం.నాగమణి, వై.బేబి తదితరులు పాల్గొన్నారు.







