హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 15 జనవరి 2022: నగరంలోని సికింద్రాబాద్ క్లబ్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఇవాళ తెల్లవారుజామున 3 గంటల సమయంలో క్లబ్లో మంటలు చెలరేగాయి. మంటలు ఎగిసిపడటంతో క్లబ్ పూర్తిగా దగ్ధమైంది. సంఘటనా స్థలానికి చేరుకున్న 10 అగ్నిమాపక యంత్రాలు దాదాపు 3 గంటలుగా మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి. ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ ప్రమాదంలో సుమారు రూ.20 కోట్ల మేర ఆస్తినష్టం జరిగినట్లు సమాచారం. బ్రిటీష్ హయాంలో మిలిటరీ అధికారుల కోసం 1878లో అ క్లబ్ ను నిర్మించారు. దాదాపు 20 ఎకరాల విస్తీర్ణంలో ఈ క్లబ్ నిర్మాణం జరిగింది. ఈ క్లబ్ ను భారతీయ వారసత్వ సంపదగా గుర్తించి 2017లో పోస్టల్ కవర్ కూడా విడుదల చేశారు. ఈ క్లబ్ లో దాదాపు 300 మంది సిబ్బంది పని చేస్తున్నారు. సికింద్రాబాద్ క్లబ్ లో 5వేల మందికి పైగా సభ్యత్వం ఉంది.







