UPDATED 30th AUGUST 2017 WEDNESDAY 2:00 PM
పెద్దాపురం: పెద్దాపురం-సామర్లకోట ప్రధాన రహదారి విస్తరణ పనులకు సంబంధించిన టెండర్లను వారం రోజుల్లో పూర్తి చేయాలని రాష్ట్ర హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆర్&బి అధికారులను ఆదేశించారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో ఆయన నియోజకవర్గ అభివృద్ధి పనులపై అధికారులు, ప్రజా ప్రతినిధులతో బుధవారం సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో చేపట్టిన ప్రభుత్వ అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆనూరు, చినబ్రహ్మదేవం, కొండపల్లి, వడ్లమూరు, జి.రాగంపేట గ్రామాలకు చెందిన గృహాల మంజూరును చేపట్టాలని ఆర్డీవో వి. విశ్వేశ్వరరావును మంత్రి ఆదేశించారు. గృహాలకు సంబంధించిన ఎలక్ట్రికల్ స్థంబాలు, సదుపాయాలపై ఎలక్ట్రికల్ ఎడి, పబ్లిక్ హెల్త్ ఎస్ ఈ తో ఫోన్ లో మాట్లాడారు. అలాగే పెద్దాపురం మండలంలో 11 పంచాయతీల్లో 2176 వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించవలసి ఉందని, వీటిని కూడా త్వరలో ప్రారంభించాలని, వీటికి అవసరమైన ఋణాలు మంజూరు చేయాలని సూచించారు. ప్రతీ గ్రామం లో సిసి రోడ్లు నిర్మాణం దాదాపు పూర్తవుతోందని చెప్పారు. అలాగే పెద్దాపురం నుంచి తామరాడ రోడ్డు విస్తరణ పనులపై మంత్రి ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు, వైస్ చైర్మన్ కోరుపూరి రాజు, గుడా డైరెక్టర్ ఎలిశెట్టి నాని, పెద్దాపురం ఎఎంసి వైస్ చైర్మన్ ఆచంట రాజన్న(రాజబాబు), మన్యం చంద్రరావు, సామర్లకోట ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి, సామర్లకోట ఎఎంసి వైస్ చైర్మన్ చిట్టిబాబు, వైస్ ఎంపిపి సత్తిబాబు, పంచాయతీ రాజ్ డీఈ హరనాథరావు, పెద్దాపురం, సామర్లకోట టిడిపి నాయకులు పాల్గొన్నారు.







