UPDATED 16th FEBRUARY 2022 WEDNESDAY 07:00 AM
★ పెద్దాపురంపై తప్పుడు ప్రచారం చేస్తే సహించం
★ సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్న యువత
★ మన పెద్దాపురం ఫేస్ బుక్ టీమ్ ఆధ్వర్యంలో నిరసన
★ నా ఊరు పెద్దాపురం పాటను తక్షణమే తొలగించాలంటూ డిమాండ్
★ దేశ విదేశాల్లో స్థిరపడిన పెద్దాపురం వాసుల నుంచి వస్తున్న స్పందన
పెద్దాపురం: ప్రాచీన సంస్థానాల్లో మిక్కిలి ప్రసిద్ధి చెందిన ప్రదేశం పెద్దాపురం. పాండవులు నడయాడిన పుణ్యక్షేత్రంగా, బౌద్ధం విలసిల్లిన ధర్మక్షేత్రంగా ఎంతో చారిత్రక వారసత్వ ఘన చరిత్ర కలిగిన పెద్దాపురంపై తప్పుడు ప్రచారాలు చేస్తే ఎంత మాత్రం సహించేది లేదని పెద్దాపురం యువత సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల జగన్నాటకం అనే సినిమాలో పెద్దాపురం పేరును దిగజార్చే విధంగా నా ఊరు పెద్దాపురం, నాకెవ్వరులేరాధారం అనే పాటను అసభ్యంగా చిత్రీకరించడంతో పాటు అశ్లీల సాహిత్యంతో యూట్యూబ్ లో రిలీజ్ చేయడంతో పెద్ద ఎత్తున పెద్దాపురం యువతతో పాటు ప్రజల నుంచి ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి.
దీనిపై ఇప్పటికే మన పెద్దాపురం ఫేస్ బుక్ టీమ్ సభ్యులు ఆపాటను తక్షణమే తొలగించాలని సోషల్ మీడియా వేదికగా తమ నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. అలాగే స్థానికులతో పాటు దేశ విదేశాల్లో స్థిరపడిన పెద్దాపురంతో అనుబంధం ఉన్న ఎంతోమంది ఆ పాటను తొలగించాలని తమ వాణిని వినిపిస్తున్నారు. దీనిపై జగన్నాటకం సినిమా డైరెక్టర్, నిర్మాతపై పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు సైతం సమాయత్తమవుతున్నారు.







