UPDATED 29th MAY 2026 7:00 PM
- వాట్సాప్ మెసేజ్‌లతో బురిడీ కొట్టించిన నకిలీ మేనేజర్
- 3 నెలల్లో 300% లాభమంటూ ఆశ చూపి నిలువునా ముంచేసిన కేటుగాడు
- బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు
పెద్దాపురం, రెడ్ బీ న్యూస్, మే 29 : షేర్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో అధిక లాభాలు ఆశజూపి ఓ దంపతులను నిలువునా ముంచేసిన భారీ ఆన్‌లైన్ మోసం కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణంలో వెలుగుచూసింది. ప్రముఖ స్టాక్ బ్రోకింగ్ సంస్థ ప్రతినిధినంటూ నమ్మబలికిన ఓ కేటుగాడు నకిలీ వాట్సాప్ సందేశాలతో ఏకంగా రూ. 85 లక్షలు కాజేసాడు. బాధితుల ఫిర్యాదుతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
నమ్మించిన నకిలీ మేనేజర్
పెద్దాపురం ఎస్ఐ వరికూటి మౌనిక తెలిపిన వివరాల ప్రకారం... పెద్దాపురం వర్జుల వారి వీధికి చెందిన సూరే వేణు, మహాలక్ష్మి దంపతులకు ఈ నెల 22వ తేదీకి ముందు ఒక వ్యక్తి ఆన్‌లైన్ ద్వారా పరిచయమయ్యాడు. తాను ప్రముఖ దేశీయ స్టాక్ బ్రోకింగ్ సంస్థ 'ఆనంద్ రాఠీ షేర్స్ అండ్ స్టాక్ బ్రోకర్స్ లిమిటెడ్'కు మేనేజర్‌నని పరిచయం చేసుకున్నాడు. తమ సంస్థలో మూడు నెలల కాలానికి డిపాజిట్ చేస్తే ఏకంగా 300 శాతం వరకు లాభాలు వస్తాయంటూ బాధితుల వాట్సాప్‌కు నిరంతరం సందేశాలు పంపుతూ నమ్మబలికాడు.
దఫదఫాలుగా రూ. 85 లక్షల డిపాజిట్
సదరు వ్యక్తి మాటలను నిజమని నమ్మిన వేణు, మహాలక్ష్మి దంపతులు ఆ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టేందుకు అంగీకరించారు. ఇందుకోసం సైబర్ నేరగాడు సృష్టించిన నకిలీ లింక్ ద్వారా ఆన్‌లైన్‌లో ఒక యూజర్ ఐడీ, బ్యాంక్ ఖాతా సంఖ్యను పొందారు. ఆ తర్వాత విడతల వారీగా తమ సొంత బ్యాంక్ ఖాతాల నుంచి ఏకంగా రూ. 85 లక్షల భారీ మొత్తాన్ని నిందితుడు సూచించిన వివిధ ఖాతాల్లోకి బదిలీ చేశారు.
విత్‌డ్రా కాకపోవడంతో బయటపడ్డ మోసం
కొంతకాలం తర్వాత బాధితులు తమ పెట్టుబడి నుంచి కొంత మొత్తాన్ని వెనక్కి తీసుకోవడానికి (విత్‌డ్రా) ప్రయత్నించగా, సాంకేతిక సమస్యలంటూ నిలిపివేశారు. దీనిపై సదరు మేనేజర్‌ను సంప్రదించేందుకు ప్రయత్నించగా అతని ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. తాము దారుణంగా మోసపోయామని గ్రహించిన బాధితులు ఈ నెల 28వ తేదీన పెద్దాపురం పోలీసులను ఆశ్రయించారు.
పోలీసుల దర్యాప్తు - ఎస్ఐ హెచ్చరిక:
బాధితుల ఫిర్యాదు మేరకు BNS 318(4) ఐటీ యాక్ట్ 66(D) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేసినట్లు ఎస్సై మౌనిక తెలిపారు. ప్రజలు ఇటువంటి నకిలీ వాట్సాప్, టెలిగ్రామ్ సందేశాలను, పరిచయం లేని వ్యక్తులు అధిక లాభాల ఆశచూపే పెట్టుబడి పథకాలను నమ్మి మోసపోవద్దని, సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఒకవేళ మోసపోతే వెంటనే 1930 నెంబర్‌కు లేదా సైబర్ క్రైమ్ వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని కోరారు.







