రాత్రి 7గంటల వరకే స్వామివారి దర్శనాలు
సింహాచలం (రెడ్ బీ న్యూస్) 12 డిసెంబర్ 2021: సింహగిరిపై శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి దేవాలయంలో ఈనెల 16వ తేదీ మధ్యాహ్నం 12.18 గంటలకు నెలగంటా నాథంతో ధనుర్మాస ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నట్లు దేవస్థానం ఈవో ఎం.వి.సూర్యకళ ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 3 నుంచి 12వ తేదీ వరకు పగల్ పత్తు ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఉదయం తిరువీధి ఉంటుందన్నారు. జనవరి 13 నుంచి 23వ తేదీ వరకు రాపత్తు ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిరోజు సాయంత్రం తిరువీధి జరుగుతుందన్నారు. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని ప్రతిరోజు రాత్రి 7గంటల వరకు మాత్రమే భక్తులకు అప్పన్న స్వామి దర్శనాలు లభిస్తాయన్నారు. జనవరి 10 నుంచి 14వ తేదీ వరకు స్వామివారి ధారోత్సవాలు సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో జరిగే ఆర్జిత సేవలు రద్దు చేసినట్లు తెలిపారు. 14న భోగి రోజున సాయంత్రం 5గంటల నుంచి గోదా శ్రీరంగనాథుల కల్యాణోత్సవం వైభవంగా జరుగుతుందని వివరించారు.







