UPDATED 21st DECEMBER 2017 THURSDAY 8:00 PM
పెద్దాపురం: రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 70 వేల కంపెనీలకు అగ్నిమాపక సంస్థ అనుమతులు లేవని ఫైర్ సేఫ్టీ రాష్ట్ర అడిషినల్ డైరెక్టర్ పి.వి.రమణ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా వాలుతిమ్మాపురం గ్రామంలో ఒంటితాడి మెట్ట ప్రాంతంలో సుమారు తొమ్మిది ఎకరాల్లో నిర్మించనున్న విపత్తుల నివారణ శిక్షణా కేంద్ర స్థలాన్ని, గిరిజా పవర్ ప్లాంట్ ను ఆయన గురువారం పరిశీలించారు. అనంతరం గిరిజా పవర్ ప్లాంట్ లో జిల్లాస్థాయి అగ్నిమాపక శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అగ్నిప్రమాదాల నివారణలో సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రమాదాలు సంభవించినపుడు అప్రమత్తతతో పాటు ప్రాణహాని జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొంటూ ప్రమాదాలను సమర్ధవంతంగా ఎదుర్కోవాలన్నారు. ముఖ్యంగా బహుళ అంతస్థుల భవనాలు, ఫ్యాక్టరీలు, గృహాలు, మొదలైన వాటిలో ప్రమాదాలు సంభవించినపుడు ప్రస్తుతం ఉన్న అగ్నిమాపక అవసరాలతో ఏవిధంగా మంటల్ని అదుపుచేయాలో సూచించారు. అలాగే ప్రపంచ బ్యాంక్ సహకారంతో రూ.35 కోట్ల వ్యయంతో టెంపరరీ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మినీ రెస్క్యూ టెండర్ ప్రక్రియలో భాగంగా జిల్లాకు మూడు ప్రత్యేక వాహనాలు కొనుగోలు చేయడం జరుగుతుందని, అలాగే నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీ ఏజెన్సీస్ ద్వారా 30 మంది బృందాన్ని గోవాకు పంపడం జరుగుతుందని, అగ్నిప్రమాదాలు ఎదురైన సందర్భాల్లో అప్రమత్తంగా ఏ విధంగా వ్యవహరించాలో వారు అక్కడ శిక్షణ తీసుకుంటారన్నారు. ఇప్పటికే కొన్ని బృందాలకు శిక్షణ పూర్తయినట్లు ఆయన తెలిపారు. అలాగే డ్రోన్లు కొనుగోలు చేసి మోనిటరింగ్ సిస్టం ద్వారా పర్యవేక్షణ చేయడం జరుగుతుందని సిబ్బందికి వివరించారు. అలాగే రాష్ట్రంలో అగ్నిమాపక శాఖ నుంచి అనుమతులు తీసుకోని కంపెనీలు అనేకం ఉన్నాయని వాటిని గుర్తించడం జరిగిందన్నారు. అలాగే అగ్నిమాపక శాఖ సూచించిన నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని, అగ్నిమాపకశాఖలో ఆధునిక పరిజ్ఞానం ద్వారా ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. త్వరలో అగ్నిమాపక శాఖలో 700 మంది నియమాకాలకు త్వరలో ప్రభుత్వ నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు చెప్పారు. అలాగే అగ్నిమాపక శాఖలో కాగితరహిత పాలనతో పాటు అన్ని అనుమతులు ఆన్ లైన్ ద్వారా నిర్వహించడం, బయో మెట్రిక్ విధానం ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఫైర్ స్టేషన్స్ లకు పక్కా భవనాలతో పాటు ఆధునిక సదుపాయాలు కలిగిన వాహనాలు కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అగ్నిమాపకాధికారి సి.హెచ్. రత్నబాబు, పెద్దాపురం అగ్నిమాపకాధికారి మలకా నాగభూషణం, గిరిజా డైరెక్టర్స్ ఆదర్ష్, హెచ్.ఆర్. చిరంజీవి, పలువురు అగ్నిమాపకాధికారులు పాల్గొన్నారు.







