నేడు సత్యదేవుని దివ్య కళ్యాణం

UPDATED 5TH MAY 2017 FRIDAY 11:30 PM

అన్నవరం : దేవదేవుని దివ్య కల్యాణ మహోత్సవాలు ప్రారంభం కావడంతో అంతర్యామి సన్నిధిలో ఆనందోత్సవం నెలకొంది. నేడు(శనివారం) రాత్రి 9.30 గంటలకు సత్యనారాయణస్వామి , అనంతలక్ష్మీ అమ్మవార్ల దివ్య కళ్యాణమహోత్సవం అత్యంత వైభవంగా జరగనుంది. ఉత్సవాల్లో భాగంగా స్వామి, అమ్మవార్లను వధూవరులను చేసి శుక్రవారం కల్యాణ క్రతువు ప్రారంభించారు. అలంకరించి స్వామి, అమ్మవార్లను అనివేటి మండపంలో ఆశీనులను చేశారు. విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవచనం, గౌరీపూజ తదితర పూజాదికాలు నిర్వహించి వధూవరులను చేసే కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముత్తైదువులు పసుపు దంచారు. అనంతరం రాత్రి 7 గంటలకు ఎదుర్కోలు ఉత్సవం జరిగింది. స్వామి, అమ్మవార్ల తరపున రెండు వర్గాలుగా పండితులు ఉండి స్వామి, అమ్మవార్ల కీర్తిప్రతిష్టలు, గుణగణాలు, వంశ చరిత్ర వివరించే ఘట్టం చలోక్తుల నడుమ సరదాగా సాగింది. రాత్రి 9 గంటలకు సత్యదేవుని క్షేత్రపాలకులుగా కొలుస్తూ దివ్యకల్యాణానికి పెండ్లిపెద్దలుగా వ్యవహరించే సీతారాముల వారిని వెండి ఆంజనేయ వాహనంపై ఊరేగించి గ్రామోత్సవం నిర్వహించారు. సేవాభావానికి ప్రతీకగా సీతారాములవారిని ఆంజనేయస్వామి కొలిచిన తీరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. కార్యక్రమాల్లో ఆలయ కార్యనిర్వహణాధికారి కాకర్ల నాగేశ్వరరావు, దేవస్థానం ఛైర్మన్‌ రాజా ఐ.వి రోహిత్‌ పాల్గొని పూజలాచరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరపున డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్  బాలాజీ పట్టువస్త్రాలు అందించారు. .కల్యాణాన్ని తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తులు హాజరుకానున్న దృష్ట్యా అందుకు అనుగుణంగా భారీ ఏర్పాట్లు చేసారు. కల్యాణ వేదిక వద్ద వీవీఐపీలు, వీఐపీలు, ప్రత్యేక ఆహ్వానితులు, భక్తులకు విభాగాలుగా బారికేడ్లు ఏర్పాట్లు చేశారు.  ఎల్‌ఈడీ స్క్రీన్లు, ప్రసాదం, అక్షింతల పంపిణీకి ప్రత్యేక కౌంటర్లు, యాత్రికులకు ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాట్లు చేశారు.
నేటి కార్యక్రమాలు 
తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాత సేవ
ఉదయం 8 గంటలకు ఘన స్వస్తి, చతుర్వేద పారాయణ
ఉదయం 9 గంటలకు అంకురార్పణ, ధ్వజారోహణము, కంకంణ ధారణ, దీక్షా వస్త్రాధారణ సాయంత్రం 4 గంటలకు అమ్మవారికి మంగళసూత్రాలు, చుట్లు, స్వామివారికి స్వర్ణ యజ్ఞోపవీతం  మంగళవాయిద్యాల నడుమ ఆనవాయితీ ప్రకారం గ్రామంలోని విశ్వబ్రాహ్మణుని వద్దకు వెళ్లి స్వయంపాకం ఇచ్చి తీసుకువస్తారు. 
రాత్రి 7 గంటలకు పెండ్లికుమారుడు సత్యదేవుని వెండి గరుడ వాహనంపైన, అమ్మవారిని వెండి గజ వాహనంపైన, పెండ్లిపెద్దలు సీతారాములవారిని వెండి పల్లకిలో ఉంచి ఊరేగిస్తారు.
రాత్రి 9 గంటలకు పెండ్లి పెద్దలు సీతారాములవారిని, పెండ్లికుమారుడు, పెండ్లికుమార్తె సత్యదేవుడు, అనంతలక్ష్మీ అమ్మవార్లను అత్యంతసుందరంగా అలంకరించి ఊరేగింపుగా కల్యాణ వేదిక వద్దకు తీసుకువస్తారు. 
9.30 గంటలకు కల్యాణ ఘట్టం ప్రారంభమవుతుంది. కల్యాణం సందర్భంగా స్వామి, అమ్మవార్లకు విశేష అలంకరణ చేస్తారు. స్వర్ణ ఆభరణాలు, పుష్పాలతో, నుదుటన తిలకం, శిరస్సుపై అలంకరణ, శంఖుచక్రాలు, పచ్చల హారం, నల్లపూసలతో అలంకరిస్తారు.
 
 
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us