CONTROVERSY : వృద్ధాశ్రమం ముసుగులో ఎమ్మెల్యే కొడుకు రియల్ అక్రమాలు: దవులూరి దొరబాబు మండిపాటు!

UPDATED 19th JUNE 2026 2:00 PM

  • వృద్ధులపై ప్రేమ ఉంటే ప్రభుత్వ భూముల్లో కట్టొచ్చు కదా?
  • తండ్రీకొడుకుల ‘సంపద సృష్టి’కి పేదలే బలిపశువులా?
  • బాధితులకు న్యాయం జరిగే వరకు సాగనున్న వైఎస్సార్‌సీపీ ధర్మపోరాటం!

పెద్దాపురం, జూన్ 19 (రెడ్ బీ న్యూస్): పేద ప్రజల ఆకలి తీర్చడం పక్కనబెట్టి, వారు తలదాచుకునే నీడను లాక్కోవడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెద్దాపురం నియోజకవర్గ ఇంచార్జ్ దవులూరి దొరబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పెద్దాపురం – సామర్లకోట ప్రధాన రహదారిలోని స్థానిక జి.రాగంపేట జగనన్న కాలనీలో శుక్రవారం మీడియా ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

​నాడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఎకరం రూ.6 కోట్ల విలువ చేసే ఐదున్నర ఎకరాల భూమిని సేకరించి, 202 మంది నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. గత మూడు సంవత్సరాలుగా ఇక్కడ సుమారు 160 కుటుంబాలు ఇళ్లు నిర్మించుకుని ప్రశాంతంగా జీవిస్తుంటే, నేడు స్థానిక ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తన అనుచరులతో కలిసి వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.

​కొడుకు వ్యాపారం కోసం వృద్ధాశ్రమం డ్రామా!

​"ఇక్కడ వృద్ధాశ్రమం కడుతున్నాం, అభివృద్ధి చేస్తున్నాం అంటూ ఫేజ్-2 కి సంబంధించిన 40 మంది పేద ప్రజల ఇళ్లను ఖాళీ చేయించడానికి బెదిరింపులకు దిగుతున్నారు. అసలు ఇక్కడ వృద్ధులపై ప్రేమతో చినరాజప్ప ఈ పని చేయడం లేదు. ఈ కాలనీ వెనుక ఆయన సుపుత్రుడు రంగనాగ్ కు చెందిన 30 ఎకరాల ప్రైవేట్ లేఅవుట్ ఉంది. ఆ లేఅవుట్ అనుమతుల కోసం సరైన రహదారి లేకపోవడంతోనే, ఇక్కడున్న పేదల స్థలాలను లాక్కొని దౌర్జన్యంగా 40 అడుగుల సీసీ రోడ్డు వేశారు" అని దొరబాబు ఆరోపించారు. వృద్ధులపై నిజంగానే ప్రేమ ఉంటే ప్రభుత్వ భూములు చాలా ఉన్నాయని, అక్కడ కట్టుకోవచ్చు కదా అని ప్రశ్నించిన ఆయన... చినరాజప్పకు కావాల్సింది వృద్ధుల సంక్షేమమా లేక కొడుకు వ్యాపార లాభాలా? అని ఘాటుగా ప్రశ్నించారు.

​తండ్రీకొడుకుల ‘సంపద సృష్టి’ అవినీతిమయం..

​గతంలో చంద్రబాబు నాయుడు 'సంపద సృష్టిస్తా' అని చెప్పి ప్రజలను ఎలా మోసం చేశారో, నేడు చినరాజప్ప కూడా ఇక్కడ ఎమ్మెల్యే అయి అదే దారిలో నడుస్తున్నారని విమర్శించారు. గతంలో గ్రావెల్ దోపిడీతో సంపద సృష్టించుకున్న చినరాజప్ప, ఇప్పుడు కొడుకుతో కలిసి పేదల ఇళ్ల స్థలాలను మింగేస్తూ ‘తండ్రీకొడుకుల సంపద’గా మార్చుకుంటున్నారని ఆరోపించారు. ఇక్కడ జరిగింది అభివృద్ధి కాదు, పక్కా అవినీతి అని, ఈ విషయాన్ని మీడియా సాక్షిగా ప్రజలందరూ గమనిస్తున్నారని అన్నారు.

​న్యాయం జరిగే వరకు ఆమరణ నిరాహార దీక్ష!

​వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేదలకు ఇచ్చిన పట్టాలు చాలా పక్కాగా, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లతో సహా ఉన్నాయని... ఏ కోర్టుకు వెళ్లినా లబ్ధిదారులకే న్యాయం జరుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ అక్రమాలపై ఇప్పటికే ఆర్డీవో (RDO)ని కలవడం జరిగిందని, అధికారులు తగిన చర్యలు తీసుకోకపోతే ఊరుకునే ప్రసక్తే లేదని, లబ్ధిదారులందరితో కలిసి ఇక్కడే కూర్చుని నిరాహార దీక్షలు, అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షలు చేస్తామని, పేదలకు న్యాయం జరిగే వరకు మా ధర్మపోరాటం, న్యాయపోరాటం ఆగదని దొరబాబు పేర్కొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us