తిరుమల (రెడ్ బీ న్యూస్) 22 నవంబర్ 2021: చిత్తూరు జిల్లాలో కురిసిన భారీ వర్షాల కారణంగా నవంబరు 18 నుంచి 30వ తేదీ వరకు ఎలాంటి కారణంతోనైనా శ్రీవారి దర్శనానికి రాలేకపోతే భక్తులకు మరో సమయంలో స్వామివారి దర్శనం కల్పించాలని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) నిర్ణయించింది. నవంబరు 25 నుంచి 28వ తేదీ వరకు మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించిన నేపథ్యంలో తితిదే ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు చర్యలు తీసుకోవాల్సిందిగా తితిదే ఈవో జవహర్ రెడ్డిని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆదేశించారు. ఇప్పటికే దర్శన టికెట్లు ఉన్న భక్తల కోసం ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ రూపొందించి వచ్చే 6 నెలల్లోగా తిరిగి స్లాట్ బుక్ చేసుకొనేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి ప్రకటన విడుదల చేశారు. ‘‘తిరుమలలో అధిక వర్షపాతం నమోదైనప్పటికీ ఒకటి, రెండు ప్రదేశాలు మినహా పెద్దగా ఎలాంటి నష్టం జరగలేదు. భక్తులు నిర్భయంగా వచ్చి స్వామివారిని దర్శించుకోవచ్చు. అలిపిరి నడకదారి మార్గం చక్కగా ఉంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకున్నాం. శ్రీవారి మెట్ల మార్గంలో నాలుగు కల్వర్టులు దెబ్బతిన్నాయి. సామర్థ్యానికి మించి వర్షపు నీరు రావడంతో బండరాళ్లు బలంగా వచ్చి తగలడంతో కల్వర్టులు దెబ్బతిన్నాయి. భక్తులు నడించేందుకు వీలుగా తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నాం. అప్పటివరకు ఈ మార్గం మూసి ఉంటుంది. అన్నదానం, కల్యాణకట్ట, శ్రీవారి ఆలయం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో ఎలాంటి ఇబ్బందులు లేవు. భక్తులు ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా స్వామివారిని దర్శించుకోవచ్చు’’ అని తితిదే ప్రకటనలో పేర్కొంది. భక్తులు నడించేందుకు వీలుగా తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నాం. అప్పటివరకు ఈ మార్గం మూసి ఉంటుంది. అన్నదానం, కల్యాణకట్ట, శ్రీవారి ఆలయం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో ఎలాంటి ఇబ్బందులు లేవు. భక్తులు ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా స్వామివారిని దర్శించుకోవచ్చు’’ అని తితిదే ప్రకటనలో పేర్కొంది.







