నల్గొండ (రెడ్ బీ న్యూస్) 15 డిసెంబర్ 2021: నల్గొండ పట్టణ శివారు ఎఫ్‌సీఐ గోదాముల సమీపంలో రోడ్డుప్రమాదం జరిగింది. గేదె అడ్డురావడంతో దాన్ని తప్పించబోయి బైక్ కిందపడింది. ఈ ఘటనలో ద్విచక్రవాహనంపై ఉన్న ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతిచెందారు. చిన్నారుల తండ్రికి తీవ్రగాయాలయ్యాయి. అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదానికి గురైన వారు నెల్లూరు జిల్లాకు చెందిన వాసులుగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసిన టూటౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆ మార్గంలో వెళుతున్న స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి వెంటనే స్పందించి 108 అంబులెన్స్ వాహనాన్ని పిలిపించారు. వైద్యుడితో మాట్లాడి గాయపడిన వ్యక్తికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు.







