UPDATED 26th SEPTEMBER 2017 TUESDAY 8:00 PM
ఏలేశ్వరం/ప్రత్తిపాడు: రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాలు శాఖా మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామంలో నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏలేశ్వరం నుంచి శాంతిఆశ్రమం గ్రామం వరకు రూ. 25 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ప్రధాన రహదారికి ఆయన హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్పతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మెరుగైన రహదారులు అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని, రవాణాకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా రహదారులను నిర్మిస్తున్నామన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సిసి రోడ్లు నిర్మిస్తున్నామన్నారు. హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం అభివృద్ధి చేయని రహదారులను టిడిపి ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం లింగంపర్తిలో రూ. 15 లక్షల వ్యయంతో నిర్మించ తలపెట్టిన పంచాయతీ భవనాన్ని, రూ. 97 లక్షల వ్యయంతో ఎస్ సి సబ్ ప్లాన్ నిధులతో సిసి రోడ్లు, రూ. రెండు కోట్ల వ్యయంతో జిల్లా పరిషత్ హైస్కూల్లో మినీ స్టేడియం నిర్మాణానికి మంత్రులు శంకుస్థాపన చేశారు. అలాగే ప్రత్తిపాడులో సి ఈ ఎస్ ఎస్ ప్రోగ్రామ్ నిధులు రూ. 64.50 లక్షలుతో నిర్మించిన బి సి బాలికల వసతి గృహాన్ని మంత్రులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఎంపీ తోట నరసింహం, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, ప్రత్తిపాడు శాసన సభ్యుడు వరుపుల సుబ్బారావు, డిసిసిబి చైర్మన్ వరుపుల రాజా, జెడ్పి చైర్మన్ జ్యోతుల నవీన్ కుమార్, ఏలేశ్వరం నగర పంచాయతీ వైస్ చైర్మన్ పైలా సత్యనారాయణ, ఎంపిపి వరుపుల తమ్మయ్యబాబు, పెద్దాపురం ఆర్డీవో వి.విశ్వేశ్వరరావు, పర్వత రాజబాబు, లింగంపర్తి సర్పంచ్ కీలు విజయలక్ష్మి, పలు గ్రామాల సర్పంచ్ లు , ఎంపిటిసిలు, అధిక సంఖ్యలో టిడిపి కార్యకర్తలు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.







