తిరుమల (రెడ్ బీ న్యూస్) 19 డిసెంబర్ 2021: టీటీడీ ఆధ్వర్యంలోని ఎస్వీ చిన్నపిల్లల సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి ఎక్కువ మొత్తంలో విరాళాలు అందించే భక్తులకు ఉదయాస్తమాన సేవా టికెట్లను త్వరలో జారీ చేయనున్నట్లు సమాచారం. ఎస్వీ చిన్నపిల్లల సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రికి ఎస్వీ ప్రాణదాన ట్రస్టు ద్వారా విరాళాలు అందించే భక్తులకు ఉదయాస్తనమాన సేవా టికెట్లను ప్రత్యేకంగా ఇవ్వాలని ధర్మకర్తల మండలి సమావేశంలో తీర్మానించామని ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పిన విషయం తెలిసిందే. శ్రీవారి ఆలయంలో ఉదయం సుప్రభాతం నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు స్వామివారికి నిర్వహించే అన్ని సేవలను ఉదయాస్తమాన సేవా టికెట్లు కొనుగోలుచేసిన భక్తులు చూసేందుకు అవకాశం కల్పిస్తారు. గతంలో వీటికి భారీగా డిమాండ్ రావడంతో తితిదే ఈ సేవను నిలిపివేసింది. దీంతోపాటు కరోనా నేపథ్యంలో గతంలో బుక్ చేసుకున్న వారికి రద్దుచేసి బ్రేక్ దర్శనాన్ని కల్పించింది. ఉదయాస్తమాన సేవా టికెట్లపై త్వరలో టీటీడీ అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది.







