AP News: ‘జిన్నా’ టవర్‌ చుట్టూ గుంటూరు రాజకీయం

అమరావతి (రెడ్ బీ న్యూస్) 30 డిసెంబర్ 2021: గుంటూరులోని జిన్నా టవర్‌ పేరు మార్చాలంటూ బీజేపీ నేతలు కొత్త చర్చకు తెరలేపారు. దేశ విభజనకు కారణమైన జిన్నా పేరును తొలగించి జాతీయ నాయకుల పేరును పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఇన్నేళ్లుగా నోరు మెదపని బీజేపీ నేతలు.. ఇప్పుడు జిన్నా టవర్‌పై మాట్లాడటమేంటని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుంటూరులో ముఖ్యమైన కూడలిగా వెలుగొందుతున్న కట్టడం జిన్నా టవర్‌. శాంతి చిహ్నంగా కుతుబ్‌మినార్‌ తరహాలో ఈ టవర్‌ను 1942లో నిర్మాణం చేపట్టి 1945లో పూర్తి చేశారు. ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా మహమ్మద్‌ అలీ జిన్నాను స్థానికులు ఆహ్వానించారు. అనివార్య కారణాలతో ఆయన హాజరు కాలేదు. తన ప్రతినిధిగా జుదాలియాఖద్‌ అలీఖాన్‌ను పంపారు. అప్పటి నుంచి జిన్నా టవర్‌గా ఈ కట్టడానికి పేరొచ్చింది. చారిత్రక ప్రాధాన్యమున్న జిన్నా టవర్‌ ఇప్పుడు వివాదంలో పడింది. నాడు దేశ విభజనకు కారణమైన జిన్నా పేరు దేశంలోని కట్టడాలకు ఉండరాదనే వాదనను భాజపా తెరపైకి తెచ్చింది. గుంటూరు నగర పాలక కమిషనర్‌ను కలిసి వినతిపత్రం అందించింది. జిన్నా పేరు తొలగించి భారతావని ఉన్నతికి పాటుపడిన అబ్దుల్‌ కలాం, ప్రాణాలర్పించిన హమీద్‌, ప్రఖ్యాత సాహితీవేత్త గుర్రం జాషువా వంటి వారి పేర్లు పెట్టడం సముచితమని భాజపా నేతలు సోము వీర్రాజు, సత్యకుమార్, రాజాసింగ్‌ డిమాండ్‌ చేస్తున్నారు. జిన్నా టవర్‌పై భాజపా నేతల వ్యాఖ్యలను వైకాపా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఖండించారు. ‘‘ఎన్నో ఏళ్ల నుంచి ఆ స్థూపం ఉంటే .. ఎప్పుడూ మాట్లాడని నాయకులు అకస్మాత్తుగా జిన్నా టవర్ గురించి మాట్లాడటం వెనుక ఉద్దేశమేంటి? విజయవాడలో మీటింగ్‌ పెట్టి రూ.50కే మద్యం అమ్ముతామని చెప్పడం. ఒక జాతీయ పార్టీ, ఈ దేశాన్ని పాలించే పార్టీగా ఈవిధమైన పోకడలతో ముందుకు సాగటం దారుణం’’ అని అప్పిరెడ్డి అన్నారు. హఠాత్తుగా జిన్నా టవర్‌ పేరు మార్పుపై వివాదం చెలరేగడం గుంటూరులో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us