UPDATED 9th JUNE 2017 FRIDAY 5:00 PM
అనపర్తి : వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే ప్రభుత్వ ధ్యేయం అని రాష్ట్ర హోం శాఖా మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం పొలమూరు గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన జిల్లా స్థాయి ఏరువాక పున్నమి కార్యక్రమానికి శుక్రవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై దుక్కి దున్ని కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వ్యవసాయ అనుబంధ రంగమైన కోళ్ల పరిశ్రమ జిల్లాలో రెండో స్థానంలో ఉందని, ఆధునిక వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి యంత్ర పరికరాలను 50 శాతం రాయితీపై అందిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇళ్ళ వద్ద పెంచడానికి పండ్ల మొక్కలను, కూరగాయల మొక్కలను, విత్తనాలు పంపిణీ చేయాలని ఆయన సూచించారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చెయ్యడం వల్ల రైతులకు గిట్టుబాటు ధర లభిస్తోందన్నారు. రైతులు మూడో పంటగా అపరాల సాగు చేసుకొని అదనపు ఆదాయం పొందే అవకాశం ఉందని, రైతులు పశు సంపదపై కూడా దృష్టి సారించాలని చినరాజప్ప సూచించారు. జడ్పీ ఛైర్మన్ నామన రాంబాబు మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు ఆధునిక పద్ధతులపై అవగాహన కల్పించి, లాభసాటిగా వ్యవసాయాన్ని మార్చడం జరిగిందన్నారు. వ్యవసాయశాఖ జేడీ ప్రసాద్ మాట్లాడుతూ ఈ ఏడాది అధిక దిగుబడులు వచ్చాయని అలాగే ఏపీ సీడ్స్ ద్వారా రైతులకు విత్తనాలు అందజేయడం జరుగుతుందన్నారు. సొసైటీల ద్వారా ఎరువులు రైతులకు అందుబాటులోఉంటాయన్నారు. భూసారం పెంచడానికి జీలుగు, జనుము, పిల్లి పెసర వంటి పచ్చిరొట్ట సాగు చేయాలని, రసాయన ఎరువుల వాడకం తగ్గించి, సేంద్రియ ఎరువులను ఉపయోగించాలని చెప్పారు. ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు మాట్లాడుతూ రెండో పంటకు నీరివ్వడం టిడిపి ప్రభుత్వ హయాం నుంచి మొదలైనందని, వ్యవసాయ అధికారుల సూచనలు, సలహాలతో వ్యవసాయం చేసి అధిక దిగుబడులు సాధించాలని తెలిపారు. రైతులు పాలను ఉత్పత్తి చేసేవారిగా ఉండాలని, అందుకే ప్రతి రైతు ఇంట పాడి ఉండాలని సూచించారు. జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా మాట్లాడుతూ ఈ సంవత్సరం అధిక వర్షాలు పడే అవకాశం ఎక్కువగా ఉందని, దీనితో రైతులకు సరిపడా నీరు అందుతుందని, అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి, వ్యవసాయ అనుబంధ శాఖల జేడీలు వేంకటేశ్వరరావు, కోటేశ్వరరావు, డీడీ పీపీ రామారావు, శిక్షణా విభాగం డీడీ లక్ష్మణరావు, ఆత్మ పీడీ పద్మజ, డీడీ ఎఫ్‌టీసీ బోసుబాబు, జడ్పీటీసీ సభ్యుడు కర్రి ధర్మారెడ్డి , ఏఎంసీ ఛైర్మన్ సిరసపల్లి నాగేశ్వరరావు, అన్నవరం దేవస్థానం పాలకమండలి సభ్యుడు సత్తి దేవానందరెడ్డి, ఈశ్వరరెడ్డి, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, జిల్లా అధికారులు, అధిక సంఖ్యలో రైతులు, తదితరులు పాల్గొన్నారు.







