UPDATED 28th OCTOBER 2022 FRIDAY 12:10 AM
ACB Court : తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో పోలీసులకు ఏసీబీ కోర్టు షాక్ ఇచ్చింది. ఈ కేసులో నిందితుల రిమాండ్ రిజక్ట్ చేశారు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి. సరైన ఆధారాలు లేవన్న న్యాయమూర్తి.. ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ PC యాక్ట్ ఈ కేసులో అప్లికబుల్ కాదన్నారు. బ్రైబ్ అమౌంట్ లేక పోవటంతో రిమాండ్ తోసిపుచ్చారు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి. 41 సీఆర్ పీసీ నోటీస్ ఇచ్చి విచారించాలన్నారు న్యాయమూర్తి.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ముగ్గురు నిందితులను పోలీసులు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. రామచంద్ర భారతి, నంద కుమార్, సింహయాజి స్వామిలను న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. ఈ ముగ్గురు నిందితుల రిమాండ్ ను న్యాయమూర్తి రిజక్ట్ చేశారు. అంతేకాదు ముగ్గురు నిందితులను తక్షణమే విడుదల చేయాలని ఆదేశించారు. అరెస్ట్ విధానాన్ని ఏసీబీ జడ్జి తప్పుపట్టారు. పెట్టిన సెక్షన్లకు సరైన సాక్ష్యాధారాలు లేవన్నారు. ముగ్గురు నిందితుల రిమాండ్ రిజెక్ట్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ యాక్ట్ లో న్యాయూమూర్తి ఎవిడెన్స్ చూస్తారు. ఈ కేసులో ఎవిడెన్స్ లేదు కాబట్టి నిందితుల రిమాండ్ రిజక్ట్ చేశారు న్యాయమూర్తి.
మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ కు కొంత సమయానికి ముందు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం వెలుగుచూడటం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపింది. అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు యత్నించిన ఓ ముఠాను సైబరాబాద్ పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పోలీసులకు చిక్కిన వారిలో ఢిల్లీకి చెందిన రామచంద్ర భారతి అలియస్ సతీశ్ శర్మ, తిరుపతికి చెందిన సింహయాజి స్వామి, హైదరాబాద్ లో దెక్కన్ ప్రైడ్ పేరిట హోటల్ నడుపుతున్న అంబర్ పేటకు చెందిన నందకుమార్ లు ఉన్నారు.







