UPDATED 22nd JUNE 2018 FRIDAY 9:00 PM
సామర్లకోట: రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్త్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. స్థానిక ఐదు తూముల లాకుల నుంచి పిఠాపురం బ్రాంచ్ కెనాల్ కు సాగునీటిని విడుదల చేసే కార్యక్రమంలో హోంమంత్రి చినరాజప్ప పిఠాపురం ఎమ్మెల్యే ఎస్.వి.ఎస్.ఎస్.ఎన్. వర్మతో కలిసి శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి చినరాజప్ప మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని, పంటలకు పుష్కలమైన సాగునీరు అందించే లక్ష్యంతో ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని అన్నారు. 2019 నాటికి పోలవరం పూర్తి చేయడం జరుగుతుందని, ఏలేరు కాలువను ఆధునీకరించడంతో పాటు సాగునీటి కాలువల సమస్యలను కూడా పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటి వరకు సాగునీరు అందించడంలో ప్రభుత్వం అన్ని విధాలా సఫలీకృతం అయ్యిందని, పిఠాపురం బ్రాంచ్ కెనాల్ ద్వారా మొదటి పంటకు నీటిని విడుదల చేయడం జరిగిందని, ఈ సాగు ద్వారా సుమారు 32,507 ఎకరాలకు నీరు అందుతుందని తెలిపారు. పిఠాపురం ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతుల సంక్షేమానికి అనేక చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఇరిగేషన్ అధికారులు వారికి నిర్దేశించిన నీటి విడుదల ప్రణాళికను తూచా తప్పకుండా పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి ఆకునూరి సత్తిబాబు, మున్సిపల్ వైస్ చైర్మన్ యార్లగడ్డ రవిచంద్ర ప్రసాద్, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి, భీమేశ్వర ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ కంటే జగదీష్ మోహన్(బాబు), ఇరిగేషన్ ఈఈ పి. అప్పల నాయుడు, పిఠాపురం బ్రాంచ్ కెనాల్ డీఈ పి.వి. రామ్ గోపాల్, జె.ఇ శేషగిరిరావు, శ్రీనివాసరావు, రైతులు తదితరులు పాల్గొన్నారు.







