Updated 9th March 2023 Thursday 6:10 am
Annavaram : కాకినాడ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుడి (Satyadeva) సన్నిధిలో ఇన్‌చార్జి ఈవోగా విచ్చేసిన ఆజాద్ (Aajad) తనదైన శైలిలో పలు సంస్కరణలకు తెరలేపారు. దీనికి సంబంధించి ఈవో కార్యాలయం ప్రత్యేక నోట్‌ను ఈనెల 7న విడుదల చేసింది. వీటిలో ప్రధానంగా ప్రతి ఉద్యోగి ఫోన్‌లో మాట్లాడిన భక్తులతో ముందుగా జై సత్యదేవ (Jai Satyadeva) అని సంబోధించాలని, ప్రతి భక్తుడు ఆలయ ప్రవేశానికి ముందే నుదుట నామం పెట్టుకునేవిధంగా పీఆర్వో కార్యాలయ సిబ్బంది చూడాలని పేర్కొన్నారు.
సిబ్బంది డ్రెస్‌కోడ్ (Dress Code ) విషయంలో నిబంధనల మేరకు నడుచుకోవాలని పేర్కొన్నారు. శానిటేషన్ పురుష, మహిళ సిబ్బంది ఎటువంటి డిజైన్ లేకుండా ఖాకీరంగు చీరను ధరించాలని సూచించారు. పాదరక్షలతో (Slippers) ఆలయ పరిసరాలలో సంచరించకుండా చూడాలని, ప్రతిఒక్క ఉద్యోగి ఐ.డి కార్డు ధరించాలని, అదే విధంగా నుదుట నామం ఉండాలని సూచించారు. స్వామివారి సేవలు, గాత్రము, గానములు గ్రామంలో కొద్ది పాటి శబ్దంతో వినబడే విధంగా మైక్ సెట్టింగ్ (Mick Setting) చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
సత్రం గదుల గుమాస్తాలు తమ గదుల తాళాలు ఎన్ని ఖాళీగా ఉన్నాయి అనేది డిస్‌ప్లే (Display) లో చూపించాలని, తులాభారం సహస్ర దీపాలంకరణ మందిరం వద్ద ఏర్పాటు చేయాలని, ప్లాస్టిక్ వినియోగం ప్రయివేటు దుకాణ సముదాయాల్లో, దేవస్థానం కౌంటర్లలో వినియోగించకుండా చూడాలని ఈ నోట్‌లో పేర్కొన్నారు. పైన పేర్కొన్న అంశాలను ఎవరు అతిక్రమించినా క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించారు.







