అమరావతి (రెడ్ బీ న్యూస్) 7 జనవరి 2022 : ప్రభుత్వ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గత కొన్ని నెలలుగా జరుగుతున్న సుదీర్ఘ చర్చల అనంతరం ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం పీఆర్‌సీపై నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 23.29 శాతం పీఆర్‌సీని ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసకుంది. ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 నుంచి 62 ఏళ్లుకు పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పెంచిన జీతాలు 2022 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. పెండింగ్ డీఏలు జనవరి నుంచి చెల్లించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. 2020 ఏప్రిల్ నుంచి కొత్త పీఆర్సీ వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 11వ వేతన సవరణ సంఘం నివేదిక అమలు, ఇతర 71 డిమాండ్ల నేపథ్యంలో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో గురువారం సీఎం జగన్ ఉద్యోగ సంఘాల జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో మాట్లాడారు. నిన్నటి సమావేశంలో ఉద్యోగ సంఘాల నుంచి సీఎం జగన్ అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఇవాళ ఉదయం నుంచి ఆర్థిక శాఖ అధికారులతో పీఆర్‌సీ అంశంపై సీఎం సమీక్ష నిర్వహించారు. రెండు రోజుల్లోగానే పీఆర్సీ పై నిర్ణయం తీసుకుంటామని నిన్న ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీ మేరకు ఇవాళ పీఆర్‌సీ ప్రకటించారు.







