రెడ్ బీ న్యూస్, 31 డిసెంబర్ 2021: సాధు జంతువైన ఉడత సైకోలా మారి.. రెండు రోజుల్లో 18 మందిని గాయపరిచింది. బ్రిటన్.. ఫ్లింట్‌షైర్‌లోని బక్లీ పట్టణంలో కొరిన్ రెనాల్డ్స్ అనే పక్షుల ప్రేమికురాలికి మచ్చికైన ఓ ఉడత రోజూ ఆమె వద్దకు వచ్చి ఆహారం తీసుకునేది. గత వారం.. క్రిస్మస్‌కు కొద్దిరోజుల ముందు అనూహ్య సంఘటన జరిగింది. ఆహారం అందిస్తున్న కొరిన్ చేతిని ఉడత కరిచి పారిపోయింది. ఇలా ఎందుకు జరిగిందా అనుకుంటున్న ఆమెకు.. కొన్ని ఫేస్‌బుక్ పోస్టులు చూడగానే భయమేసింది. కంటపడ్డ ఫేస్‌బుక్ పోస్టులన్నీ ఆ ఉడత గురించే... అందరిదీ ఒకటే ఫిర్యాదు.. ఉడత కరిచిందని. సుమారు 16 వేల జనాభా ఉండే బక్లీలో క్రిస్మస్ వేళ ఇదే హాట్ టాపిక్.. ఆ ఉడతకు ‘గ్రెమ్లిన్స్’ సినిమాలోని విలన్ పేరు (స్రైప్) పెట్టారు. ఇలాగైతే కష్టమనుకున్న కొరిన్ రోజూ ఆహారం వేసేచోట ఉచ్చు పెట్టి ఉడతను బంధించింది. ఈ ఉడతను ‘ద రాయల్ సొసైటీ ఫర్ ద ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్స్’ సంస్థ స్వాధీనం చేసుకుంది. దూరంగా అడవిలో వదిలేద్దామంటే స్థానిక చట్టం అంగీకరించదు. చంపడం తప్ప మరో మార్గం లేదని నిర్ణయించారు. ఓ పశువైద్యుడు ఇంజెక్షన్ చేసి ఉడతకు కారుణ్య మరణం ప్రసాదించారు. ఇంత జరిగినా.. ఉడతను నమ్మించి బంధించానే అని కొరిన్ విషాదంలో మునిగిపోయింది.







