విజయవాడ (రెడ్ బీ న్యూస్) 21 డిసెంబర్ 2021: ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరుడు సుభానీ చేతిలో వైకాపా నాయకుడు సోమిశెట్టి సుబ్బారావు గుప్తా దాడికి గురైన విషయం రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశం అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని సుబ్బారావు గుప్తా కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. సోమవారం సాయంత్రం ఒంగోలు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తనపై జరిగిన దాడి అంశాన్ని వివరించిన సుబ్బారావు.. అక్కడి నుంచి నేరుగా మరికొంతమంది వైకాపా నేతలతో కలిసి విజయవాడ వెళ్లారు. అక్కడ మంత్రి బాలినేనిని కలిసి జరిగిన సంఘటన వివరాలను ఆయనకు వివరించినట్లు సమాచారం. తానెప్పుడూ బాలినేని, వైకాపా విధేయుడినేనని.. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై మాత్రమే వ్యాఖ్యలు చేసినట్లు తెలిపారు. అనంతరం సీఎం జగన్ జన్మదిన వేడుకల్లో కేక్ కట్ చేసి మంత్రి, సుబ్బారావు గుప్తా పరస్పరం తినిపించుకున్నారు. ఈ వివాదం సమసిపోవాలని ఇరువర్గాలు మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది.







