UPDATED 16th JUNE 2017 FRIDAY 8:00 PM
సఖినేటిపల్లి : అంతర్గత భద్రతకు మెరైన్ పోలీసు వ్యవస్థ ఎంతో కీలకమని రాష్ట్ర హోం శాఖా మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది లో రూ.50 లక్షలు కేంద్ర నిధులతో నిర్మించిన నూతన మెరైన్ పోలీసు స్టేషన్ భవనాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ శాంతి భద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, రాష్ట్రాభివృద్థికి శాంతిభద్రతల అంశం చాలా కీలకమని, దీనికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తోందని అన్నారు. రాష్ట్రంలోని 10 జిల్లాల్లో తీర ప్రాంత భద్రతలో 21 మెరైన్ పోలీసు స్టేషన్లు ఉన్నాయని. తీర ప్రాంత రక్షణలో కేంద్రం కోస్ట్‌గార్డ్ వ్యవస్థ, రాష్ట్రం మెరైన్ వ్యవస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయని చెప్పారు. స్టేషన్లకు అవసరమైన అన్నిసదుపాయాలు సమకూర్చుకునేందుకు తగిన నిధులు బడ్జెట్‌లో కేటాయించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఫిషింగ్ హార్బర్ నిర్మాణం పనులు వేగంగా జరుగుతున్నాయని, దీనిని సెప్టెంబర్‌లో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అలాగే పర్యాటకరంగానికి కూడా ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. మత్య్సకారుల సంక్షేమానికి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని చెప్పారు. రాష్ట్రంలో 974 కిలోమీటర్ల పొడవునా ఉన్న తీర ప్రాంత భద్రతకు 21 స్టేషన్‌లు పనిచేస్తున్నాయని చెప్పారు. మెరైన్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి చుట్టూ బయోఫెన్సింగ్, గార్డెన్ ఏర్పాటు చేసి ఆహ్లాదకరమైన వాతవరణం తీసుకుని రావాలని మెరైన్ సీఐ శ్యాంకుమార్, సిబ్బందికి మంత్రి సూచించారు. అనంతరం ఫిషింగ్ హార్బర్, మెరైన్ స్టేషన్లు ఏర్పాటుకు సహకరించిన దాతలను హోం మంత్రి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మెరైన్ ఇన్‌ఛార్జి ఐజీ సంజయ్, మెరైన్ డీఎస్పీలు రాజారావు (విశాఖ జోన్), నరసింహారావు (నార్త్ జోన్), ఓఎస్డీ రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.







