రెడ్ బీ న్యూస్, 21 డిసెంబర్ 2021: భారత్‌కు చెందిన ఈ-కామర్స్ దిగ్గజం స్నాప్‌డీల్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్‌కు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. తాజాగా దీనికి సంబంధించి అనుమతుల కోసం మంగళవారం దరఖాస్తు చేసుకొంది. ఇప్పటికే భారత్‌లో డజన్ల కొద్దీ సంస్థలు ఐపీవోకు వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకొంటున్నాయి. ముఖ్యంగా జపాన్‌కు చెందిన పెట్టుబడుల దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్ మద్దతు ఉన్న కంపెనీలు మార్కెట్‌బాట పట్టాయి. వీటిల్లో పేటీఎం, నైకా, జొమాటో వంటి స్టార్టప్‌లు ఉన్నాయి. మార్కెట్లలో నగదు ప్రవాహం పెరగడం, చిన్న ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తుండటంతో చాలా కంపెనీలు ఐపీవోలకు వస్తున్నాయి. స్నాప్‌డీల్ తాజాగా రూ.1,250 కోట్లు విలువైన షేర్లను మార్కెట్లో విక్రయించనుంది. 30.8 మిలియన్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ కింద కేటాయిస్తోంది. న్యూదిల్లీ కేంద్రంగా పనిచేసే స్నాప్‌డీల్‌ను 2010లో కునాల్ బహల్, రోహిత్ బన్సల్‌లు ప్రారంభించారు. భారత్‌లో ఇది ఫ్లిప్‌కార్ట్, ఆమెజాన్‌తో పోటీ పడుతోంది. తాజాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా ఈ మార్కెట్‌లోకి రావడంతో పోటీ పెరిగిపోయింది. ఈ ఐపీవోలో బహల్, బన్సల్‌లు తమ వాటాలను విక్రయించడంలేదు. సాఫ్ట్‌బ్యాంక్, ఫాక్స్‌కాన్, ఓట్రియో టీచర్స్ పెన్షన్ ప్లాన్ బోర్డ్ వంటి సంస్థలు వాటాల్లో కొంత మొత్తాన్ని విక్రయించే అవకాశం ఉంది.







