UPDATED 1st JULY 2017 SATURDAY 6:00 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్లో ఎంటర్ ప్రెన్యూర్ షిప్ అండ్ మేనేజ్మెంట్ అనే అంశంపై నిర్వహించిన అంతర్జాతీయ సదస్సు శనివారంతో విజ్ఞానదాయకంగా ముగిసింది. ఈ ముగింపు కార్యక్రమం బిజినెస్ స్కూల్ డైరెక్టర్ డైరెక్టర్ ఎన్. సుగుణా రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. అలాగే ఐఆర్ఎన్ఎ మాజీ డైరెక్టర్ డాక్టర్ కె. ప్రతాప్ రెడ్డి, బిట్స్ పిలాని దుబాయ్ క్యాంపస్ నుంచి డాక్టర్ శ్రీనివాస్, అహమ్మదాబాద్ కు చెందిన ఈడిఐ డైరెక్టర్ డాక్టర్ దినేష్ అవస్థి, ఛత్తీస్గడ్ కు చెందిన ఐబి డైరెక్టర్ సుమితా దావే లు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు సాంప్రదాయేతర మెళకువలను తెలుసుకుని భిన్నమైన ఆలోచనా దృక్పధం కలిగినవారు వ్యాపారరంగంలో విజయ పథంలో పయనిస్తారన్నారు. మేనేజ్మెంట్ స్టడీ చేస్తున్న విద్యార్థి నూతన ఆలోచన, పరిశోధనాత్మక ఆలోచన కలిగి ఉండాలని, ఆ ఆలోచన ప్రపంచగతినే మార్చివేసే విధంగా ఉండాలని అన్నారు. మేనేజ్మెంట్ విద్య అనేది విద్యార్థి ఉద్యోగాల కోసం ప్రయత్నించడం కాదని, ఉద్యోగాలు కల్పించి వందలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించి మార్గదర్సకులుగా నిలవాలన్నారు. యువతః స్వయం ఉపాధి, వ్యాపార రంగాల వైపు వెళ్లే విధంగా బ్యాంకింగ్ రంగం, విద్యా రంగం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు కలిసి అనుభవజ్ఞులైన ఇంజినీర్ల లేదా పారిశ్రామికవేత్తలతో ఒక సమగ్ర ప్రణాళిక రచించి దానిని అనుసరించి ప్రయత్నిస్తే అభివృద్ధి సాధించవచ్చన్నారు. అనంతరం డైరెక్టర్ డాక్టర్ సుగుణా రెడ్డి మాట్లాడుతూ రెండు రోజులు పాటు నిర్వహించిన ఈ అంతర్జాతీయ సదస్సు విజయవంతకావడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. అలాగే ముఖ్య అతిధులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.







