UPDATED 19th JUNE 2017 MONDAY 8:00 PM
పెద్దాపురం: రాష్ట్రంలో 2020-22 నాటికి అందరికి ఇళ్ళు నిర్మించే బృహత్తర కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలోని 38 పురపాలక సంఘాల్లో ప్రధాన మంత్రి ఆవాస యోజన, ఎన్టీఆర్ నగర పథకం కింద గృహ నిర్మాణ పనులను విజయవాడ నుంచి శంకుస్థాపన చేసిన అనంతరం వీడియో కాన్ఫరెన్స్ లో అధికారులతో మాట్లాడారు. రాష్ట్రంలో నిర్మించే 10.30 లక్షల గృహాలకు రూ. 26 వేల కోట్లు ఖర్చవుతుందని, అలాగే మరో 2 లక్షల గృహాల కోసం రూ. 8 వేల కోట్లు ఖర్చుతో కలిపి మొత్తం రూ.34 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. అలాగే ఈ గృహ నిర్మాణంలో మౌలిక వసతుల కల్పన కోసం రూ. 12 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. జి ప్లస్ త్రీ విధానంలో మూడు నమూనాల్లో నిర్మించే ఈ గృహాలు వచ్చే 17 నెలల కాలంలో పూర్తయ్యే విధంగా ప్రణాళికలు రూపొంచామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కోరిన విధంగా కేంద్రం 2 లక్షల గృహాలను కూడా మంజూరు చేస్తుందని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్లు ముఖ్యమంత్రి వివరించారు. అనంతరం హోం మంత్రి చినరాజప్ప, కలెక్టర్ కార్తికేయ మిశ్రా తో కలిసి వాలు తిమ్మాపురం రోడ్ లో నిర్మిస్తున్న అందరికి ఇళ్ళ స్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వి.విశ్వేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు, వైస్ చైర్మన్ కొరుపూరి రాజు, కమీషనర్ శేషాద్రి, పట్టణ టిడిపి అధ్యక్ష, కార్యదర్శులు రంధి సత్యనారాయణ, తూతిక రాజు, కౌన్సిల్లర్లు, కోఆప్షన్ సభ్యులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.







