UPDATED 8th JUNE 2017 THURSDAY 7:00 PM
కాకినాడ: ఇచ్చిన మాట ప్రకారం అగ్రవర్ణాల్లో పేదలకు న్యాయం చేస్తామని, అలాగే బిసిలకు అన్యాయం జరగకుండా కాపు కులస్థులకు రిజర్వేషన్లు కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో టిడిపి నేతలు, కార్యకర్తలతో చంద్రబాబు గురువారం మహా సంకల్ప ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన చివరి రక్తపు బొట్టు ఉన్నంత వరకు పేదల కోసం పనిచేస్తామని అన్నారు. కులం, మతం, ప్రాంతాల పేరుతో రెచ్చగొట్టాలని కొందరు చూస్తున్నారని, వారి మాయలో పడొద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తుని, అమలాపురం, చింతూరులో డయాలసిస్ సెంటర్లు నెలకొల్పుతామని, రాజమండ్రిలో ఫారెస్ట్ అకాడమీని ఏర్పాటు చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.
గిరిజన విద్యార్థులు పట్టుదలతో ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కారని, ఎవరెస్ట్ అధిరోహించిన విద్యార్థులకు రూ.10 లక్షల చొప్పున సాయం ప్రకటించినట్లు చంద్రబాబు చెప్పారు. సంకల్పం ఉంటే ఏదైనా సాధించ వచ్చుని, ఎవరెస్ట్ అధిరోహించిన చిన్నారులను ఈ సందర్బంగా అభినందిస్తున్నానని ఆయన అన్నారు. నవ నిర్మాణ దీక్షలో భాగంగా అనేక అంశాలపై చర్చించినట్లు సిఎం చెప్పారు. ప్రణాళికాబద్ధంగా నిర్మించిన నగరం కాకినాడ అని, కాకినాడను స్మార్ట్‌సిటీగా అభివృద్ధి చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. ఆగస్టు 15 నాటికి పురుషోత్తపట్నం ఎత్తిపోతలను పూర్తిచేసి ఏలేరు కాల్వకు, పొలాలకు నీరు ఇస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు ముమ్మరంగా సాగుతున్నాయని, కాఫర్ డ్యాంకు ఇవాళ శంకుస్థాపన చేసినట్లు బాబు చెప్పారు. 2018 నాటికి గ్రావిటీ ద్వారా నీళ్లు ఇవ్వాలని సంకల్పం చేసుకున్నామని, ౨౦౧౯ నాటికి పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తామన్నారు. ఈ ఏడాది జూన్1నే గోదావరి డెల్టాకు సాగునీరు ఇచ్చామని, వర్షపాతం తక్కువగా ఉన్నప్పటికీ వ్యవసాయ అనుబంధ రంగాల్లో ప్రగతి సాధించామని అన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో 14 శాతం వృద్ధి సాధించామని, రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ను నెం-1 రాష్ట్రంగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఏడు మండలాలను ఎపిలో కలపకపోతే పోలవరం ప్రాజెక్ట్ పూర్తయ్యేది కాదని చంద్రబాబు అన్నారు. హేతుబద్ధత లేని విభజన వల్ల ఎంతో నష్టపోయామని, యుద్ధ విమానంలో బిల్లు పంపి అవమానించారని, ఇటలీ రిపబ్లిక్ డే రోజున రాష్ట్రాన్ని విభజించారని చంద్రబాబు ఆనాటి యూపీఏ ప్రభుత్వం పై ధ్వజమెత్తారు. రాష్ట్ర విభజనతో అభద్రతాభావానికి గురయ్యానని అన్నారు. ఆర్థికలోటు ఉన్నా రూ. 24వేల కోట్ల రుణమాఫీ చేశామని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే ఎన్డీఏతో పొత్తు పెట్టుకున్నామని, ప్రత్యేక హోదాతో సమానంగా నిధులు ఇస్తామంటేనే ప్యాకేజీకి ఒప్పుకున్నామని ఆయన అన్నారు. ఇంటి గౌరవాన్ని కాపాడుకోవాలంటే ప్రతి ఇంటికి మరుగుదొడ్లు నిర్మించుకోవాలని, ఎన్టీఆర్ వైద్య సేవ కింద రూ. 2.5 లక్షలు, ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని, తాను ప్రవేశపెట్టిన దీపం పథకాన్ని కాంగ్రెస్ నేతలు ఆర్పేశారని చంద్రబాబు దుయ్యబట్టారు. ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్ ఇస్తున్నామని, విదేశీ విద్య కోసం రూ.10 లక్షల ఆర్థికసాయం చేస్తున్నామని, ఇష్టపడి పనిచేస్తే కష్టమనిపించదని చంద్రబాబు వ్యాఖ్యానించారు.







