UPDATED 1st MAY 2018 TUESDAY 9:00 PM
సామర్లకోట: శ్రమకు,శక్తికి, పోరాటాలకు ప్రతీకగా నిలిచే ఎర్రజెండా వాడవాడలా రెపరెపలాడింది. ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మేడే వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. మేడే వర్థిల్లాలి, ప్రపంచ కార్మికులారా ఏకంకండి, ప్రపంచ శాంతి వర్ధిల్లాలి, ఎర్ర జెండా ప్రజలకు అండ అంటూ నినదిస్తూ ఎర్రజెండా రెపరెపలతో మేడే వేడుకలను కార్మికులు పెద్ద ఎత్తున జరుపుకున్నారు. స్థానిక మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కార్యాలయం వద్ద రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప జెండాను ఆవిష్కరించి కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల హక్కుల సాధనలో సమిధలైన అమరవీరుల త్యాగ దినోత్సవాన్ని మేడేగా జరుపుకుంటున్నామని వారి ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరు పాటుపడాలని కోరారు. ప్రతీ మేడే కార్మికులకు ప్రేరణనిస్తుందన్నారు. కార్మికుడనే వాడు ప్రపంచంలో ఎక్కడన్నా ఏ పనిలో ఉన్నా కార్మికులంతా ఒకటేనని, మేడే నాడు ఎర్రజెండా ప్రపంచమంతా రెపరెపలాడుతందన్నారు. కార్మికులకు ఎనిమిది గంటల పనిదినం పనిలో భద్రత, స్త్రీ, పురుషులకు సమాన వేతనాలు, సెలవులు కోసం చేసిన పోరాటాల నుంచి మేడే ఆవిర్భవించిందన్నారు. కార్మికుల సమస్యలన్నిటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి, వివిధ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.







