రోగులకు మెరుగైన సేవలు అందించాలి

* క్యాజువాలిటీకి వచ్చిన అరగంటలో వైద్యులు పరీక్షించాలి 
* పరికరాల పనితీరు 15 రోజులకొకసారి పరీక్షించాలి 
* జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా
UPDATED 29th JULY 2017 SATURDAY 2:00 PM
కాకినాడ: ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి (జీజీహెచ్‌)లో రోగులకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా అధికారులను ఆదేశించారు. స్థానిక జీజీహెచ్‌లో కలెక్టర్‌ శనివారం సుడిగాలి పర్యటన చేశారు. ఉదయం 10 గంటలకు జీజీహెచ్‌కు చేరుకున్న ఆయన తొలుత అత్యవసర విభాగాన్ని పరిశీలించి అక్కడి రోగులకు అందుతున్న వైద్య సేవలను పర్యవేక్షించారు. ఎమ్‌ఆర్‌ఐ విభాగానికి వెళ్లి అక్కడ గత కొద్ది నెలలుగా సేవలందించిన రోగుల జాబితాను పరిశీలించారు. అనంతరం న్యూరోసర్జరీ వార్డు, చంటిపిల్లల శస్త్రచికిత్స, మతాశిశువిభాగాన్ని సందర్శించి రోగులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. శనివారం జీజీహెచ్‌లో ఆసుపత్రి అభివృద్ధి సంఘం(హెచ్‌డిఎస్‌) సమావేశం ఆయన అధ్యక్షతన జరిగింది. పెరుగుతున్న రోగుల సంఖ్య వారి అవసరాలకు అనుగుణంగా అందుబాటులో ఉన్న వనరులను సమర్థంగా వినియోగించుకోవాలని, ఆసుపత్రిలో సేవలు, సదుపాయాలను మరింత విస్తృతం చేయాల్సిన అవసరం ఉందని కలెక్టర్‌ పేర్కొన్నారు. అత్యవసర విభాగానికి వచ్చే రోగులను అరగంట వ్యవధిలో సంబంధిత వైద్య నిపుణులు పరీక్షించి వారి ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా ఐసియు లేదా వార్డుకు తరలించాలని ఆదేశించారు. ఆసుపత్రిలో 8 ఐసియుల ద్వారా రోగులకు మెరుగైన వైద్యం అందించేలా సంబంధిత విభాగాధిపతులకు బాధ్యతలు అప్పగించారు. వెంటిలేటర్ల సంఖ్య, వాటి పనితీరు, ఇంకా అవసరమైన వాటిగురించి తనకు నివేదికను అందజేయాలని, శస్త్రచికిత్స విభాగాల్లో ప్రాణవాయువు సరఫరా, చికిత్స సమయంలో వాడే మత్తు మందుల అందుబాటును ఎప్పటికప్పుడు ఎముకల వైద్య విభాగాధిపతులు పర్యవేక్షించాలన్నారు. సిబ్బంది హాజరు పర్యవేక్షణకు బయోమెట్రిక్‌ యంత్రాలను తప్పక ఏర్పాటు చేయాలని ఆసుపత్రి ఉన్నతాధికారులకు సూచించారు. నిష్ణాతులైన వైద్య సిబ్బంది 24 గంటలూ అందుబాటులో ఉండాలని, జాప్యం లేకుండా రోగనిర్ధారణ నివేదికలు రోగులకు అందించాలని ఆదేశించారు. ఇకపై సమావేశాన్ని మూడు నెలలకోసారి ఏర్పాటు చేయనునట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆసుపత్రి  సూపరెంటెండెంట్ డా.రాఘవేంద్రరావు కొత్త భవనాలు, పడకల పెంపు అవసరాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. జిల్లా యువజన సంఘాల కార్యదర్శి గేదెల శ్రీనివాస్‌ కలెక్టర్‌తో మాట్లాడుతూ రేడియాలజీ విభాగం, సిటి స్కాన్‌ కేంద్రాలలో నివేదికలు అందించడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని, మహిళా వార్డులు విస్తరించాలని కోరారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్  ఎ.మల్లిఖార్జున, జీజీహెచ్‌ సూపరెంటెండెంట్  డా.ఎమ్‌.రాఘవేంద్రరావు, ఆర్‌ఎమ్‌సి ప్రిన్సిపల్‌ ఆర్‌.మహాలక్ష్మి, డిప్యూటీ సూపరెంటెండెంట్ జిఎస్‌ఎన్‌ మూర్తి, ఆర్‌ఎమ్‌వో టిఎస్‌ఆర్‌ మూర్తితోపాటు వివిధ విభాగాధిపతులు పాల్గొన్నారు.
 
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us