Updated 4th May 2017 Thursday 3:00 PM
పెద్దాపురం: శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో నూతన ఆవిష్కరణలకు పెద్దాపురం మండలం దివిలి కిట్స్ ఇంజనీరింగ్ కళాశాల కేరాఫ్ అడ్రస్ గా మారింది. నూతన ఆవిష్కరణలను చేస్తూ ఈ కళాశాల విద్యార్థులు అందరి దృష్టి ని ఆకర్షిస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పరిశోధనలు చేస్తూ తమ సత్తా చాటుతున్నారు. దీనిలో భాగంగా డి హ్యూమిడి ఫైర్ యంత్రాన్ని రూపొందించి అందరి ప్రసంశలు అందుకున్నారు. కళాశాలలో బిటెక్ అగ్రికల్చర్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు వెంకటరత్నం, స్వర్ణలత, సంధ్యారాణి, శ్వేతా మీనన్ లు సంయుక్తంగా రూపొందించిన డి హ్యుమిడి ఫైర్ యంత్రాన్ని గురువారం కళాశాల చైర్మన్ బేతినీడి శ్రీనివాసరావు ఆవిష్కరించారు. ఈ యంత్రాన్ని ప్రొఫెసర్ శ్రీకాంత్ పర్యవేక్షణలో విద్యార్థులు రూపొందించారు. గాలిలోని తేమ ద్వారా నీటి తయారి, తేమను మంచినీరుగా మార్చి ప్రజల తాగునీటి అవసరాలను శాశ్వతంగా తీర్చగలిగే యంత్రాన్ని ఆవిష్కరించడంపై కళాశాల చైర్మన్ హర్షం వ్యక్తం చేసారు. ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో తమ కళాశాల విద్యార్థులు ఈ యంత్రాన్ని రూపొందించడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం యంత్రం తయారి, పనితీరును విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శర్మ, ఏవో కెఆర్ సందీప్, ఈవొ జెన్నిబాబు, ఏసివో పెదకాపు, హెచ్ వో డి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.







