అమరావతి (రెడ్ బీ న్యూస్) 4 జనవరి 2022 : ఏపీ భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ ఆలోచించాలని.. రాష్ట్రంలో జరిగిన పరిణామాలను ప్రజలు అవగతం చేసుకోవాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. వైకాపా విధ్వంసపాలనతో జరగబోయే నష్టాన్ని ప్రజలంతా గమనించాలని కోరారు. అమరావతిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విధ్వంసంతో పాలనను ప్రారంభించారని.. ప్రజల కోసం కట్టిన ప్రజావేదికను కూల్చివేశారన్నారు. ప్రజల ఆస్తి విధ్వంసంతోనే వైకాపా నేతల ఉన్మాదం బయటపడిందని చంద్రబాబు మండిపడ్డారు. దానికి కొనసాగింపుగా అమరావతి విధ్వంసం మొదలుపెట్టారన్నారు. రాజధాని కోసం 50వేల ఎకరాల భూమిని రైతులు ఇచ్చారని.. వారంతా స్వచ్ఛందంగా ముందుకొచ్చారని చెప్పారు. భూములు ఇచ్చిన పాపానికి రైతులకు అవమానాలా? అని ఆయన నిలదీశారు. రూ.కోట్ల ఆస్తిని విధ్వంసం చేస్తున్నపుడు ప్రజా చైతన్యం ఎంతో అవసరమని చెప్పారు. అమరావతి, పోలవరం అభివృద్ధి చెందితేనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందన్నారు. 2021లోనే పోలవరం పూర్తిచేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి, మంత్రి ఎక్కడున్నారని.. దీనికి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.







