UPDATED 15th SEPTEMBER 2017 FRIDAY 9:00 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో జాతీయ స్థాయి టెక్ ఫెస్ట్ వేద 2 కె 17 కార్యక్రమాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కాకినాడ ఓ ఎన్ జి సి గ్రూప్ జనరల్ మేనేజర్ ఎస్. సత్యపాల్ హాజరైనారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతీ ఒక్కరిలో ఏదో ఒక గొప్ప ప్రతిభ దాగివుంటుందని, అనుభవజ్ఞులైన పెద్దలు, గురువులు చెప్పింది విని ఆచరించడం, మంచి పుస్తకాలను చదివి తెలుసుకోవడం, అహంకారాన్ని విడిచిపెట్టి మీ ఆలోచనా పరిధిని విస్తరించిననాడు ప్రపంచాన్ని మార్చే విధాతలవుతారని విద్యార్థులకు దిశానిర్దేశం చేసారు. సంస్థ వైస్ చైర్మన్ సతీష్ రెడ్డి మాట్లాడుతూ భావి ఇంజినీర్ల సృజనాత్మక ఆలోచనలకు ఈ వేద చక్కని వేదికగా నిలుస్తుందని, ఇంజనీరింగ్ విద్యార్థులు నూతన ఆవిష్కరణలతో ప్రపంచాన్ని అభివృద్ధిపథంలో పరుగులు పెట్టించాలని పిలుపు నిచ్చారు. అనంతరం దేశం నలుమూలలు నుంచి ఈ కార్యక్రమానికి హాజరైన కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన ప్రాజెక్ట్ నమూనాలను ఆసక్తిగా తిలకించారు. ఈ కార్యక్రమంలో వైజాగ్ ఎన్టీపీసీ సింహాద్రి అడిషనల్ జనరల్ మేనేజర్ మాలకొండయ్య, వైజాగ్ బి ఎస్ ఎన్ ఎల్ జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు, కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్, కాకినాడ రిలయన్స్ ప్లాంట్ హెడ్ వేణుగోపాలరాజు, పాలిటెక్నిక్ కళాశాల ప్రినిపాల్ ఎస్.టి .వి .ఎస్ . కుమార్, వైస్ ప్రిన్సిపాల్ ఏ. మాధవరావు, వివిధ బ్రాంచ్ లకు చెందిన విభాగాధిపతులు తదితరులు పాల్గొన్నారు.







