★ రాష్ట్రంలో 144 ఆక్సిజన్ ప్లాంట్లను ప్రారంభించిన సీఎం
అమరావతి (రెడ్ బీ న్యూస్) 10 జనవరి 2022 : కొవిడ్ వల్ల రాష్ట్ర ఆదాయం తగ్గినా ఆస్పత్రుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో 50 పడకలు దాటిన 188 ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ తయారీ ప్లాంట్లను తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి జగన్ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా నిమిషానికి 44 వేక లీటర్ల మెడికల్ ఆక్సీజన్ ఉత్పత్తి చేసే 144 పీఎస్ఎ ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వాటిని జాతికి అంకితం చేసినట్లు వివరించారు. ప్లాంట్లను ప్రభుత్వం సొంతంగా ఏర్పాటు చేస్తోందన్నారు. 50 పడకల ఆస్పత్రుల్లోనూ ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 100 పడకలకు పైగా ఉన్న ప్రైవేట్ ఆస్పత్రుల్లో ప్లాంట్లకు 30 శాతం రాయితీ ఇచ్చినట్లు తెలిపారు. ఇవన్నీ పూర్తైతే 247 చోట్ల ఆక్సిజన్ తయారీకి అవకాశం ఉందని జగన్ వివరించారు. సెకండ్ వేవ్ సమయంలో ఆక్సిజన్‌ను ఎయిర్ లిఫ్ట్ చేయాల్సి వచ్చిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 24419 బెడ్లకు ఆక్సిజన్ పైప్ లైన్లు ఉన్నట్లు జగన్ చెప్పారు. 74 లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ట్యాంకులు ఏర్పాటు చేశామన్నారు. 163 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో పీడియాట్రిక్ కేర్ యూనిట్లు అందుబాటులో ఉన్నట్లు జగన్ చెప్పారు. కనీసం ఒక్క వీఆర్ డీఎల్ ల్యాబ్ కూడా లేని పరిస్థితి నుంచి 20 అత్యాధునిక ఆర్టీపీసీఆర్ వైరల్ (వీఆర్ డీఎల్) ల్యాబ్లు ఏర్పాటు చేసినట్లు జగన్ తెలిపారు. ఇప్పటి వరకు 82 శాతం మంది టీనేజర్లకు వ్యాక్సినేషన్ పూర్తి చేసినట్లు ఆయన వివరించారు.







