* రాష్ట్రంలో సర్వేయర్ల వ్యవస్థ విస్తరణ
* భూ సర్వే, పరిపాలన ముఖ్య కమీషనర్ అనిల్ చంద్ర పునేఠా
UPDATE 22nd JUNE 2018 FRIDAY 9:00 PM
సామర్లకోట: సర్వేయర్లు ప్రజల కోసం పనిచేసి వారి మన్ననలు పొందాలని, రాష్ట్రంలో సర్వేయర్ల వ్యవస్థను విస్తరించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర భూ సర్వే, పరిపాలనా విభాగం చీఫ్ కమీషనర్ అనిల్ చంద్ర పునేఠా ఆన్నారు. స్థానిక రాష్ట్ర సర్వేయర్ల శిక్షణా సంస్థలో 2018 బ్యాచ్ డిప్యూటీ సర్వేయర్ల శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వే శాఖ రెవెన్యూ శాఖలో అంతర్భాగమని, సర్వేయర్లు భూముల వివరాలను తెలియజేయడంలో ప్రముఖపాత్ర వహిస్తారని, రాష్ట్రంలో అమలు చేసే ప్రతీ ప్రోజెక్ట్ పని మొదట సర్వేతోనే ప్రారంభమవుతుందని, ఈ శాఖను విస్తరించడానికి అవసరమైన చర్యలు చేపడతామన్నారు. రాష్ట్ర విభజన అనంతరం 232 డిప్యూటీ సర్వేయర్ల నియామకం చేపట్టడం జరిగిందని, వీరిలో 118 మందికి రాజమహేంద్రవరంలో, 114 మందికి సామర్లకోటలో నాలుగున్నర నెలల పాటు శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. సర్వే శాఖ ద్వారా రోడ్లు, భవనాలు, జాతీయ రహదార్లు, ఇరిగేషన్ వంటి అన్ని ప్రోజెక్ట్ పనులకు సర్వే అవసరముందని, శిక్షణ పొందిన సర్వేయర్లలో ఎక్కువ మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారని, వీరు తమ సాంకేతిక నైపుణ్యంతో విధులు నిర్వహించాలని సూచించారు. సర్వే నిర్వహణలో వచ్చిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానమైన ఇటిఎస్, డిజిపిఎస్, క్యాడ్ సాఫ్ట్ వేర్, ఎఫ్ఎంబి డిజిటలైజేషన్ వంటి తదితర పద్ధతులు ఆచరణలోకి వచ్చాయని అన్నారు. రాష్ట్రంలో లైసెన్సుడ్ సర్వేయర్ల వ్యవస్థను కూడా పటిష్టపరుస్తామని, ప్రతీ మండలంలో కూడా కనీసం ఇద్దరు సర్వేయర్లు ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. శిక్షణ పొందిన సర్వేయర్లు భూ రికార్డుల నిర్వహణలో పూర్తి పరిజ్ఞానం కలిగి వాటి నిర్వహణ సక్రమంగా చేపట్టాలని అన్నారు. జిల్లా కలెక్టర్ కార్తికేయమిశ్రా మాట్లాడుతూ రాష్ట్రంలో భూరికార్డుల నిర్వహణలో ప్రత్యేకత కలిగి ఉందని, ఇటువంటి రాష్ట్రంలోని సర్వే శాఖ ఉద్యోగులుగా ప్రజలకు సేవ చేయడానికి మంచి అవకాశమని అన్నారు. శిక్షణ పొందిన సర్వేయర్లు రెవెన్యూ శాఖ అప్పగించిన సర్వే పనులను బాధ్యతగా నిర్వహించి, ప్రజల మన్ననలను పొందాలన్నారు. రాష్ట్ర సర్వే సెటిల్ మెంట్, ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్ డాక్టర్ యన్. ప్రభాకరరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో సర్వే కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నామని, శిక్షణ పొందిన సర్వేయర్లు క్షేత్రస్థాయిలో పూర్తి అవగాహనతో పని చేయాలన్నారు. అనంతరం శిక్షణలో ఉత్తమ ఫలితాలు సాధించిన సర్వేయర్లకు ప్రశంసా పత్రాలను అనిల్ చంద్ర పునేఠా అందజేశారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం సబ్ కలక్టర్ సాయికాంత్ వర్మ, రంపచోడవరం సబ్ కలక్టర్ వినోద్ కుమార్, రాజమహేంద్రవరం మున్సిపల్ కమీషనర్ సుమిత్ కుమార్ గాంధీ, సర్వే శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఎన్. నూతన్ కుమార్, కాకినాడ, పెద్దాపురం, అమలాపురం ఆర్డీవోలు ఎల్.రఘుబాబు, వసంతరాయుడు, బి.వి. రమణ, సర్వే శాఖ ఆర్డీ సి.హెచ్.వి.ఎస్.ఎన్. కుమార్, ఫ్యాకల్టీలు పి. త్రివిక్రమరావు, జి. నమశివాయ, తదితరులు పాల్గొన్నారు.







