* అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ రత్నప్రశాంతి
UPDATED 6th DECEMBER 2019 FRIDAY 8:00 PM
పెద్దాపురం(రెడ్ బీ న్యూస్) : రైతులకు నాణ్యమైన పంట ఉత్పాదకాలు, సాంకేతిక పరిజ్ఞానం, సాగులో మెళకువలు అందించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ ఎం. రత్నప్రశాంతి పేర్కొన్నారు. పెద్దాపురం మండలం కట్టమూరు, పులిమేరు, కాండ్రకోట, గోరింట, తదితర గ్రామాల్లో ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘ భవనాలను ఆమె శుక్రవారం పరిశీలించారు. ఈ భవనాల్లో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు అనుకూలంగా ఉంటాయో లేదో అని తెలుసుకునేందుకు భవనాలను పరిశీలించినట్లు తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సాగులో మెరుగైన పద్దతులు, నూతన విధానాలను వివరిస్తూ ఏ విత్తనాలు వాడాలి, ఏ నమయంలో ఎంత మోతాదులో ఎరువులను వినియోగించాలి అని చెప్పడంతో పాటు సీజనల్ వారీగా విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు గ్రామ పంచాయతీల్లోనే అందుబాటులో ఉంచేలా ప్రభుత్వం భావిస్తున్నట్లు పేర్కొన్నారు. వ్యవసాయ, ఉద్యాన, పశు సంవర్ధక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఈ కేంద్రాలను నిర్వహించడం జరుగుతుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో కట్టమూరు పిఎసిఎస్ చైర్మన్ రంగనాధం రమాదేవి, సిఇవో పి.ఎస్.వి.ఎన్. ఆచార్యులు, పిఎసిఎస్ సిబ్బంది పిట్టు రంగారావు, ఎస్. నాగభూషణం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రంగనాధం శ్రీనివాసరావు, ఎఇవో ఎన్.వి.వి. ప్రసాద్, విఏఏ కొల్లి ఉదయకుమార్, తదితరులు పాల్గొన్నారు.







