UPDATED 7th MAY 2018 MONDAY 9:30 PM
రంపచోడవరం: గిరిజనుల సమస్యలపట్ల సానుకూలంగా స్పందించి సత్వరమే పరిష్కరించాలని ఐటిడిఎ పివో నిషాంత్ కుమార్ సెక్టోరియల్ అధికారులను ఆదేశించారు. స్థానిక ఐటిడిఎ సమావేశపు హాలులో సోమవారం నిర్వహించిన మీకోసం ప్రజాసమస్యల పరిష్కారవేదిక కార్యక్రమంలో సుమారు 80 మంది అర్జీదారులు తమ అర్జీలను వ్రాత పూర్వకంగా పీవో నిషాంత్ కుమార్, సబ్ కలెక్టర్ డాక్టర్ వి. వినోదకుమార్, ఎపివో జనరల్ నాయుడుకు అందజేశారు. ఈ సందర్భంగా పివో మాట్లాడుతూ ఇంజనీర్లు నిర్మాణ పనులకు సంబంధించి అటవీ అభ్యంతరాలు ఉత్పన్నమైతే వెంటనే పరిష్కారానికి తగు చర్యలు తీసుకుని అనుమతులు పొందిన వెంటనే ఆయా నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. వేసవిలో త్రాగునీటి ఎద్దడి సమస్యలు లేకుండా కార్యాచరణ ప్రణాళికలు సమర్ధవంతంగా అమలు చేయాలన్నారు. మారేడుమిల్లిలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలకు పూర్తిస్థాయిలో అవసరమైన స్థలాన్ని సమకూర్చాలని సబ్ కలెక్టరుకు సూచించారు. స్థానిక మండల పరిధిలోని దరమడుగుల గ్రామానికి చెందిన కారం గంగరాజుదొర ఇంటర్ చదివానని, ఏదైనా జీవనోపాధిని కల్పించాలని, సుంకర చిరంజీవిబాబు కుల ధృవీకరణ పత్రం ఇప్పించాలని కోరారు. పెదపాడుకు చెందిన ఎస్. అబ్బాయిరెడ్డి ఐటిడిఎ పరిధిలో డ్రైవరు ఉద్యోగం ఇప్పించాలని, రంపకు చెందిన జల్లి రమేష్ బాబు కుల ధృవీకరణ పత్రం ఇప్పించాలని కోరారు. అడ్డతీగల మండలం దుశ్చర్తికి చెందిన నక్కా బాయమ్మ గృహం మంజూరు చేయాలని, దేవీపట్నం మండలం మామిడివలస గ్రామస్తులు పి. ముట్టన్నదొర తదితరులు మామిడివలస-ఆకూరు రోడ్లు వేయాలని కోరారు. ఇందుకూరుపేటకు చెందిన కంకపాటి లక్ష్మణరావు కోర్టు వాయిదాకు వెళ్లడానికి అవకాశం కల్పించాలని, చినరమణయ్య పేటకు చెందిన పి. పోసయ్య 18 సంవత్సరాల ప్యాకేజీని ఇప్పించాలని, తొయ్యేరు గ్రామానికి చెందిన పి. పోసయ్య ఎస్. నాగశ్రీను తదితరులు ప్యాకేజి ఇప్పించాలని కోరారు. చింతూరు మండలం చదలవాడకు చెందిన సాందుల రామిరెడ్డి ఎ.పి.ఆర్.జె.సిలో అటెండరు ఉద్యోగం ఇప్పించాలని, వై.రామవరం మండలం రెడ్డినగర, మెట్టగూడెంలకు చెందిన సాదల సన్యాపిరెడ్డి, కె. సరుబులు కరెంటు షాక్ తో ఎద్దులు మృతి చెందాయని నష్టపరిహారం అందించి ఆదుకోవాలని పీవోను ఆశ్రయించగా పైన పేర్కొన్న సమస్యలన్నింటిని ఆయా శాఖలకు నివేదించి, విచారణ అనంతరం నిబంధనలకు లోబడి తగు పరిష్కార మార్గాలు పూర్తి స్థాయిలో చూపడం జరుగుతుందని పివో తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమశాఖ ఇఇ పి.కె. నాగేశ్వరావు, ఉప సంచాలకులు ఎం. సరస్వతి, ఎపిడిలు లక్ష్మయ్యబాబు, రాంబాబు, వై. సత్యంనాయుడు, పి.హెచ్.వో వై. సత్యనారాయణ, వ్యవసాయ శాఖ ఎడిలు రాబర్ట్ పాల్, డి. శ్రీనివాసరెడ్డి, జి.సి.సి డిఎం రాజన్ రాజు, డిఎపివో జి. రాజ్యలక్ష్మి, సబ్ డి.ఎఫ్.వో శామ్యూల్, హౌసింగ్ ఇఇ కె.రవిశంకర్, డివిజనల్ ఇంజనీర్లు పి.ఎస్.వి లక్ష్మి, రాంప్రసాద్, పద్యనాభం, సత్యనారాయణ, ఎడిఇ ట్రాన్సుకో వై.వి. లక్ష్మీనారాయణ, ఎంపిడివో బి. సరస్వతి, తహసీల్దార్ పి. రామోజి, వివిధ శాఖలకు చెందిన సెక్టోరియల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.







