మహిళల భద్రతకు భరోసా

* ఉత్సాహంగా ‘ఆడబిడ్డకు రక్షగా కదులుదాం’ 
* కదిలివచ్చిన ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు  
UPDATED 7th MAY 2018 MONDAY 9:00 PM
సామర్లకోట : గుంటూరు జిల్లా దాచేపల్లిలో ఇటీవల చోటుచేసుకున్న అత్యాచార ఘటన నేపథ్యంలో ప్రజల్లో చైతన్యం నింపేందుకు ప్రభుత్వం పిలుపునిచ్చిన ‘ఆడబిడ్డకు రక్షగా కదులుదాం’ కార్యక్రమానికి సోమవారం పట్టణ ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. పట్టణంలో ముందుగా ఎండివో కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం, మున్సిపల్ ఆఫీస్ మీదుగా స్టేషన్ సెంటర్, సాయిబాబా గుడి రింగ్ సెంటర్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మహిళలు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, ఉద్యోగులు, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ ఎల్.  శివకుమార్ మాట్లాడుతూ స్త్రీల పట్ల ఎలా మెలగాలి, ఏదైనా దుశ్చర్యకు పాల్పడితే పర్యవసానం ఎలా ఉంటుంది తదితర విషయాలను మగ పిల్లలకు తల్లిదండ్రులు వివరించాలన్నారు. చట్టాలు, శిక్షల గురించి హెచ్చరించాలని, సమాజంలో మహిళలను గౌరవించే సంస్కృతిని మన కుటుంబం నుంచే అలవాటు చేయాలన్నారు. రాష్ట్రంలో ఆడబిడ్డకు రక్షగా ఉందామని ఉద్యమాన్ని చేపట్టడం, ఇలాంటి పరిస్థితులు రావడం దురదృష్టకరమన్నారు. ప్రస్తుతం చోటు చేసుకుంటున్న ఘటనలు చూస్తే ఆడబిడ్డను కనాలంటే భయపడాల్సిన రోజులు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మగాడు భార్యను తప్ప ప్రతి మహిళను గౌరవంగా చూడాలని వేదాలు చెబుతుంటే, తల్లిని తప్ప అందరినీ విషపు చూపు చూస్తుండటం చాలా బాధాకరమని పేర్కొన్నారు. వీటికి అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత మనందరి భుజస్కంధాలపై ఉందని చెప్పారు. మున్సిపల్ కమీషనర్ సి.హెచ్. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ దేశంలో మహిళలపై అఘాయిత్యాలు పెచ్చుమీరాయని, కొందరు ఉన్మాదుల చేష్టలు సభ్య సమాజానికే తలవంపులుగా పరిణమించాయన్నారు. మానవులు నైతిక విలువలు మరిచి ఉన్మాదంతో వ్యవహరించే వారిని సమాజానికి దూరం చేయాలన్నారు. ఎన్ని చట్టాలు, కోర్టులు ఉన్నా మహిళలపై నేరాలు ఆగడం లేదన్నారు. ఎందుకిలా జరుగుతున్నాయో ప్రతి ఒక్కరూ ఆలోచించాలని పేర్కొన్నారు. కుటుంబ వ్యవస్థలో మార్పులు రావడమే ఇందుకు కారణమన్నారు. అందరు బాధ్యత తీసుకుంటేనే వీటిని నివారించగలమని పేర్కొన్నారు. రాష్ట్రపతి అవార్డు గ్రహీత ప్రధానోపాధ్యాయుడు తోటకూర సాయిరామకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులను శక్తివంతులుగా, విద్యావంతులుగా, ఆరోగ్యవంతులుగా తయారుచేసి రేపటి పౌరులుగా తీర్చిదిద్దవలసిన బాధ్యత మనందరి పైనా ఉందని, సమాజంలో కొంతమంది మూర్ఖులు అభం శుభం తెలియని బాలికలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులకు పాల్పడుతూ మానవతా విలువల్ని మంటగలుపుతున్నారన్నారు. చిన్నప్పటి నుంచే పిల్లల్లో సోదర భావాన్ని పెంపొందించాలి. ప్రత్యేకంగా మగపిల్లల్లో చాలా అవసరం. తల్లి, అక్క, చెల్లి వంటి పదాలను వారి మెదడులోకి ఎక్కించే బాధ్యత తల్లిదండ్రులదే. ప్రతి ఆడపిల్ల, మహిళలను సోదరభావంతో చూడాలన్న విషయాన్ని పరిపూర్ణంగా అవగాహన కల్పించాలి. తల్లిదండ్రులే కాకుండా, పాఠశాలల్లోనూ క్రమంగా బోధనలో ఉండేలా చూడాల్సి ఉందన్నారు. సిడిపివో పద్మావతి మాట్లాడుతూ సమాజంలో మహిళలపై జరుగుతున్న నేరాలు ఘోరాలకు అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత మనందరి పైనా ఉందని,  మన సమాజంలో అనాదిగా స్త్రీలకూ ఒక ప్రత్యేక స్థానం, గౌరవం ఉందన్నారు. ఆడది అబల కాదు సబల అని, స్త్రీ శక్తి స్వరూపిణి అని మన చరిత్ర చెబుతోందని, మహిళల జీవితాలతో ఆడుకుంటే మన జీవితమే సమాప్తం అవుతుందనేది దాచేపల్లి దుష్టుడి ఉదంతమే గుణపాఠం వంటిదన్నారు. మనిషిలో ఉన్నటువంటి మానవత్వానికి మృగత్వానికి జరుగుతున్న సమరంలో మానవత్వం ఓడిపోయి మృగత్వం కామవాంఛతో పేట్రేగిపోతోందని పేర్కొన్నారు. విజ్ఞత కోల్పోతున్న కొందరు చిన్నపిల్లలపై క్రూరత్వాన్ని ప్రదర్శించడం గొప్ప సంస్కృతి ఉన్న దేశంలో ఆలోచించాల్సిన విషయమన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చట్టాలను రాటుదేల్చడంతో పాటు మనిషిలోని మానవత్వాన్ని తట్టి లేపాల్సి ఉందని వివరించారు. అనంతరం రింగ్ సెంటర్ వద్ద  ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం డిఎస్పీ చిలకా వెంకట రామారావు, సామర్లకోట ఎఎస్సై కె. లక్ష్మి, ఎంపిడివో జగ్గారావు, జడ్పీటిసీ గుమ్మళ్ళ విజయలక్ష్మి, ప్రధానోపాధ్యాయుడు యు. సత్యన్నారాయణ,  ప్రెసిడెంట్ ఆకుల అనంతలక్ష్మి, సెక్రటరీ ఆకుల సూర్యావతి, ట్రెజరర్ మాదాబత్తుల తరంగిణి. ఆర్.పి.ఎం. శైలజ, సిడిపివో ఎం. సుజాత, టిఎంసి కె. సుధాకరరావు, కమ్యూనిటీ ఆర్గనైజర్ పి. వెంకటలక్ష్మి, కె. సుధారాణి, పి. శైలజ, తదితరులు పాల్గొన్నారు. 
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us