Updated 14th April 2017 Friday 12:30 PM
పెద్దాపురం: భారత రత్న డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని పెద్దాపురం మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు పేర్కొన్నారు. స్థానిక మున్సిపల్ సెంటర్లో జై భీం సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన అంబేద్కర్ 126 వ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిధి గా పాల్గొని శుక్రవారం మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ జయంతి వేడుకలను పండుగను తలపించే రీతిలో నిర్వహించాలని పిలుపునిచ్చిందని ఆయన పేర్కొన్నారు. అంబేద్కర్ ను చరిత్ర కారుడిగా,తత్వ వేత్త గా, రాజనీతి కోవిదుడుగా ప్రపంచ మేధావి గా గుర్తించారని కొనియాడారు. బడుగు, బలహీన వర్గాలకు, మైనార్టీలకు ఇబ్బంది లేకుండా రాజ్యాంగాన్ని రచించిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అన్నారు. పెద్దాపురం పట్టణంలో రూ. కోటి తో హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప సహకారంతో నిర్మిస్తున్న అంబేద్కర్ ఏ సి భవన నిర్మాణ పనులు శరవేగంతో చేపడుతున్నామని, అంబేద్కర్ వర్ధంతి నాటికి ఈ నిర్మాణం పనులు పూర్తి చేయడం జరుగుతుందన్నారు. ఏఎంసీ చైర్మన్ ముత్యాల వీరభద్రరావు(రాజబ్బాయి) , ఆర్డీవో వి. విశ్వేశ్వరావు మాట్లాడుతూ ప్రపంచ దేశాలలో పరిపాలనా విధానాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నా భారతదేశంలో మాత్రం అంబేద్కర్ రచించిన రాజ్యాంగంతో ప్రజలంతా స్వేచ్ఛగా బ్రతకడానికి అవకాశం ఉంటోందన్నారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వారు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కొరుపూరి రాజు , ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ బొడ్డు బంగారుబాబు, కౌన్సిలర్ బేదంపూడి సత్తిబాబు, జై భీం సంఘ సభ్యులు, అంబేద్కర్ అభిమానులు,తదితరులు పాల్గొన్నారు.







